నారాయణఖేడ్, మార్చి 20: నల్లవాగు ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ-3 కింద ఉన్న పోచాపూర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి కోరారు. గురువారం మాజీ ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ.. మొత్తం ఏడు డిస్ట్రిబ్యూటర్ల ద్వారా ఆయకట్టుకు నీటిని విడుదల చేయాల్సి ఉండగా, నల్లవాగు ప్రాజెక్టులో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ 3వ డిస్ట్రిబ్యూటర్‌కే నీటిని విడుదల చేయకపోగా, దిగువన ఉన్న డిస్ట్ట్రిబ్యూటర్ల కింద ఆయకట్టు పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
తైబందీ పరిధిలో ఉన్న పోచాపూర్ ఆయకట్టుకు నీరు విడుదల చేయని కారణంగా పంటలు ఎండిపోతున్నాయని, ఆవేదనతో రైతులు తన వద్దకు వచ్చి మొర పెట్టుకుంటున్నారని తెలిపారు. రైతుల పంటలు ఎండకుండా వెంటనే పోచాపూర్ ఆయకట్టుకు నీరు వదలాలని తాను అధికారులకు విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. కలెక్టర్, నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులు చొరవ చూపి నీటిని విడుదల చేసి పంటలు కాపాడాలని భూపాల్‌రెడ్డి కోరారు.