నారాయణఖేడ్, ఆగస్టు 4: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంపిక చేసిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే లబ్ధిదారులకు అందజేయాలని కోరుతూ సోమవారం పెద్ద సంఖ్యలో తరలివచ్చిన లబ్ధిదారులతో కలిసి ఆయన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ సబ్‌కలెక్టర్ కార్యాలయంలో డీఏవో అనితకు వినతి పత్రం సమర్పించిన సందర్భంగా మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నారాయణఖేడ్ నియోజకవర్గానికి 1400 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేసిందన్నారు.
పిప్రి, నిజాంపేట్, పెద్దశంకరంపేట, బల్కంచెల్కతండాలో మొత్తం 350 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి లబ్ధిదారులకు పంపిణీ చేయగా పట్టణ సమీపంలోని జూకల్ శివారులో రూ.55 కోట్లు వెచ్చించి 795 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించినట్లు తెలిపారు. అర్హులైన పేదలకు పంపిణీ చేసే నిమిత్తం అప్పట్లో పారదర్శకంగా లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల తుది దశ పనులు పూర్తి చేసి పంపిణీ చేయాల్సి ఉండగా ఎన్నికల కోడ్ కారణంగా అప్పట్లో పంపిణీ చేయలేకపోయామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు గడుస్తున్నా లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ చేయకపోగా గతంలో ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాను రద్దు చేసి కాంగ్రెస్ కార్యకర్తలు, అనర్హులకు కేటాయించేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. లబ్ధిదారులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమని న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఎంపికలో అవినీతికి పాల్పడినట్లు కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని, ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, ఒక వేళ నిరూపించలేకపోతే క్షమాపణ చెప్పి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఆయన సవాల్ విసిరారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నారాయణఖేడ్ పట్టణానికి మంజూరైన 3200 ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు కాంగ్రెస్ నాయకులు దండుకున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నారాయణఖేడ్ పట్టణ శివారులో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయగా వాటి బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేయడం ఏమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పరమేశ్, పట్టణ అధ్యక్షుడు నగేశ్, నాయకులు రవీందర్‌నాయక్, ఎంఏ.నజీబ్, అహీర్ పరశురామ్, విజయ్ బుజ్జి, ముజామిల్, విఠల్, లయక్, శేఖర్, లంబాదాస్, గోపాల్, మల్గొండ, సంగప్ప, గీతారెడ్డి పాల్గొన్నారు.