నారాయణఖేడ్, మే 14: రైతులు పండించిన వడ్లు, జొన్నలు,మక్కలు, పొద్దుతిరుగుడు పంటల కొనుగోళ్లు వేగవంతం చేయాలని నారామయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం మాజీ ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ.. వడ్లు, జొన్నలు కొనుగోలు కేంద్రాల్లోనే రోజుల తరబడి ఉండిపోవడంతో రైతులు ఎండలు, అకాల వర్షాలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.
రైతులు ఇబ్బందులు గుర్తెరిగి ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నివారించాలన్నారు. రైతుకు ప్రతిఫలం దక్కాలంటే ప్రతి ధాన్యాన్ని మద్దతు ధర కల్పించి కొనుగోలు చేయాలన్నారు. ప్రభుత్వానికి రైతులపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు.