మెదక్, జూలై 9 (నమస్తే తెలంగాణ):
మెదక్ జిల్లాలో 871 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 607, యూపీఎస్ 124, జడ్పీ హైస్కూళ్లు 140 ఉన్నాయి. 65,610 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి మధ్యాహ్న భోజన కార్మికులు ప్రతిరోజు మధ్యాహ్న భోజన పథకం కింద భోజనాన్ని మెనూ ప్రకారం అందిస్తున్నారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులకు పెండింగ్ వేతనం, బిల్లులు, గుడ్ల బిల్లులు రాకపోవడం తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 5 నెల ల నుంచి కుక్ కం హెల్పర్‌కు చెల్లించే రూ.3 వేల గౌరవ వేతనం 6 నెలలకు సంబంధించిన వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. 5 నెలల నుంచి మధ్యాహ్న భోజన కార్మికులకు చెల్లించాల్సిన బిల్లులు సైతం పెండింగ్‌లో ఉన్నాయి. నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో అప్పులు చేసి భోజనం వండిపెడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం మధ్యాహ్న భోజ న కార్మికులకు రూ.10వేల వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే బిల్లులు చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.