పటాన్చెరు రూరల్, జూలై 4 : పక్కనున్నవి ట్రాన్స్‌పోర్టులో వచ్చిన బాక్సులు కాదు.. మృతుల మాంసపు ముద్దులున్న బాక్సులు… ఔను, మీరు విన్నది నిజమే. సిగాచి పరిశ్రమలో సంభవించిన భయంకరమైన పేలుడులో ఛిద్రమైన కార్మికులు, సిబ్బంది శవాలివి. ముక్కలు ముక్కలై కొన్ని శవాలు… కాలిపోయి బూడిదైనవి మరికొన్ని శవాలు… డీఎన్ఏ టెస్టుల కోసం శిథిలాల నుంచి వెతికి తెచ్చిన మాంసం ముద్దలు కొన్ని ఇవి. పోస్టుమార్టం చేసుకున్న దేహాలు, డీఎన్ఏ శాంపిల్స్ సేకరించిన మాంసం ముద్దలతో కూడిన మనుషుల శవాలు ఇవి. పూర్తి బాడీ దొరక్క దొరికిన ప్రతి మాంసం, ఎముకల ముక్కలను బాక్స్‌ల్లో దాచి పెట్టారు. వాటి వివరాలు రాసి ఉంచారు.
వారి తాలూకు రక్తసంబంధీకులు డీఎన్ఏ టెస్టుల కోసం ఇచ్చిన రక్తపు నమూనాలకు ఈ మాంసం ముద్దలు, ఎముకల ముక్కల నమూనాలు సరిపోతే వాటిని ఒక మృతదేహంగా గుర్తించి సంబంధిత కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. ఐదు రోజులుగా ఈ శవ పంచనామా కొనసాగుతూనే ఉంది. అంత్యక్రియలు చేసి గంగలో కలిపేందుకు కొద్దిపాటి బూడిదైనా చాలు అని హిందువులు, థోడా బాడీ మిలాతో బస్ దఫ్నాదేంగే అంటూ ముస్లింలు, కొంచెం బాడీ ఇచ్చిన ప్రేయర్ చేసి అంత్యక్రియలు చేస్తామని క్రిస్టియన్లు చెబుతూ పోస్టుమార్టం గది వద్ద పడిగాపులు కాస్తున్నారు. ప్రమాదం, మరణం కులమతాలకు అతీతం అని నిరూపించే దారుణ దుర్ఘటన ఇది. డీఎన్ఏ టెస్టుల ఫలితాలు వస్తేనే ఈ డబ్బాలు శవపేటికలై అంత్యక్రియలకు వెళ్తాయి. ఈ డబ్బాల్లో ఉన్నది శవాల తాలూకు ఆనవాళ్లని తెలిసిన ప్రజలు కన్నీంటి పర్యంతం అవుతున్నారు. ఇలాంటి చావు శత్రువుకు కూడా రావద్దని మొక్కుతున్నారు.