మునిపల్లి, డిసెంబర్ 10: ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వారి ప్రేమను ఇరు కుటుంబాలు ఒప్పుకోలేదు. ఎలాగైనా పెండ్లి చేసుకోవాలని ఆ ప్రేమజంట గట్టిగా నిర్ణయించుకుంది. అందులోభాగంగానే సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బుసారెడ్డిపల్లి శివారులోని తెలంగాణ హరిత రెస్టారెంట్లో ఇద్దరు కలిసి గురువారం ఉదయం 11గంటలకు రూమ్ బుక్ చేసుకొని పసుపుతాడుతో పెండ్లి చేసుకున్నారు
అనంతరం ఆత్మహత్య చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి ఎస్సై రాజేశ్‌నాయక్ వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాంతంలోని నిజాంపేటకు చెందిన కర్పే ఉదయ్(21), మంగళి రోహిత(20) ఒకరినొకరు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెద్దల సమక్షంలో పెండ్లి చేసుకుందామని, ఇరు కుటుంబాలకు చెప్పడంతో పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరు కలిసి పెండ్లి చేసుకొని ఆత్మహత్య చేసుకోవడం ఇరు కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది.
కలిసి బతకలేం…విడిచి ఉండలేం…మన కల పెండ్లి చేసుకోవడం అనుకున్నారు ఇద్దరు ప్రేమికులు. అద్దెకు తీసుకున్న గదిలోనే పెండ్లి చేసుకున్న తర్వాత కొన్ని గంటల్లోనే ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుసారెడ్డిపల్లి లో శుక్రవారం కలకలం రేపింది. ప్రేమ పెండ్లికి ఇరు కుటుంబాలు ఒప్పుకోకపోవడం ఈ ఆత్మహత్యకు దారితీసిందని సమాచారం. మృతురాలు రోహిత నారాయణఖేడ్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతున్నది. ఉదయ్ మిరపకాయల వ్యాపా రం చేసేవాడు. రెస్టారెంట్ మేనేజర్ సాంబశివరావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.