భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జోరు మీదున్నది.అన్ని పార్టీలకన్నా ముందే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ప్రజా ఆశ్వీరాద సభలు’ గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. భారీగా జనం తరలివచ్చి సీఎం కేసీఆర్ ప్రసంగాలను ఓపిగ్గా విన్నారు. సీఎం మాటలు, బీఆర్ఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని గ్రామాల్లో ప్రజలు చర్చకు పెడుతున్నారు. గతనెల 15న హుస్నాబాద్‌లో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే హుస్నాబాద్, సిద్దిపేట, నారాయణఖేడ్‌లో సభలు ముగిశాయి. ఈనెల 15న మెదక్‌లో, 16న నర్సాపూర్‌లో, 18న జనగామ (చేర్యాల)లో, 23న జహీరాబాద్, పటాన్చెరులో, 26న దుబ్బాకలో, 27న అందోల్, సంగారెడ్డిలో, 28న గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ సభల్లో పాల్గొంటారు. సీఎం సభలు ఉమ్మడి మెదక్ జిల్లాను మొత్తం కవర్ చేయనున్నాయి. సీఎం సభలు తమకు అనుకూలంగా మారనున్నదని బీఆర్ఎస్ అభ్యర్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ అభ్యర్థులు ఉత్సాహంగా ప్రచారం చేస్తుండడంతో క్యాడర్లో జోష్ నెలకొంది. మా మద్దతు బీఆర్ఎస్ పార్టీకే..మా ఓటు సీఎం కేసీఆర్‌కే వేస్తాం… అభ్యర్థులకే మా మద్దతు అంటూ గ్రామాలు, పట్టణాల్లో అన్ని వర్గాల ప్రజలు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని క్లీన్‌స్వీప్ చేసి సీఎం కేసీఆర్‌కు కానుక ఇచ్చేలా మంత్రి హరీశ్‌రావు పనిచేస్తున్నారు. ఇప్పటికీ అన్ని స్థానాలకు అభ్యర్థులు దొరకని విచిత్ర పరిస్థితులను కాంగ్రెస్, బీజేపీ ఎదుర్కొంటుండగా..ఆ పార్టీల క్యాడర్లో అయోమయం నెలకొన్నది.
సిద్దిపేట, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): శాసనసభ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ మంచి దూకుడు మీద ఉన్నది. అన్ని పార్టీలకన్నా ముందే అభ్యర్థులను ప్రకటించడంతో పాటు ప్రచారంలోనూ తనదైన శైలిలో ముందు వరుసలో ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన “ప్రజాఆశ్వీరాద సభలు” గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. సీఎం కేసీఆర్ ప్రసంగాలను ఓపిగ్గా విన్న ప్రజలు గ్రామాల్లో బీఆర్ఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చర్చకు పెడుతున్నారు. ఇంత మంచిగా చేసిన ప్రభుత్వానికే తమ మద్దతు అంటూ ఆయా గ్రామాలు ఏకగ్రీవ తీర్మానాలు సైతం చేస్తున్నాయి. సిద్దిపేట జిల్లాలో గత నెల 15న హుస్నాబాద్‌తో సీఎం కేసీఆర్ ప్రజాఆశ్వీరాద సభలకు శ్రీకారం చుట్టి రాష్ట్రంలో అనేక సభల్లో పాల్గొంటున్నారు. 17న సిద్దిపేట, 30న నారాయణఖేడ్‌లో నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. ఈనెలలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు కవరయ్యేలా ప్రజాఆశీర్వాద సభల నిర్వహణకు పార్టీ ప్రణాళిక సిద్ధం చేసింది. అన్ని సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో ఈనెల 15న మెదక్ నియోజకవర్గ ఆశీర్వాద సభ జరగనుండగా, ఈనెల16న నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ప్రజాఆశీర్వాద సభలు నిర్వహించేలా బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసింది.
18న సిద్దిపేట జిల్లాలోని జనగామ నియోజకవర్గం పరిధలోని చేర్యాల పట్టణం, 26న దుబ్బాక నియోజకవర్గ కేంద్రం, 28న సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌లో ప్రజాఆశీర్వాద సభ నిర్వహిస్తారు. సంగారెడ్డి జిల్లాలో ఈనెల 23న జహీరాబాద్, పటాన్చెరు నియోజకవర్గ కేంద్రాల్లో, 27న ఆందోల్, సంగారెడ్డి నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజాఆశీర్వాద సభలు జరగనున్నాయి. ఈనెల 20న కరీంనగర్ జిల్లా మానకొండూరులో ప్రజాఆశీర్వాద సభ జరగనున్నది. ఆదిశగా సభలు నిర్వహించి బీఆర్ఎస్ తనసత్తా మరోసారి చాటి ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట అని చాటి చెప్పనున్నారు. రాష్ర్టానికి ఈశాన్య ప్రాంతంలో ఉన్న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నుంచి ప్రజాఆశీర్వాద సభలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టి గజ్వేల్ సభతో ప్రజాఆశీర్వాద సభలను పూర్తి చేస్తారు. శనివారం సీఎం కేసీఆర్ నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తన నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రజల వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించడంతో ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. అంత పెద్ద వ్యక్తి మా వద్దకు వచ్చి మమ్ముల్ని ఆప్యాయంగా పలకరించాడని కోనాయిపల్లి గ్రామస్తులు తమ సంతోషం వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ అప్పగించిన పార్టీ బాధ్యతలను ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు పక్కాగా అమలు చేస్తూనే.. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి విశేషంగా కృషి చేస్తున్నారు. ప్రతి పక్ష పార్టీల ఎత్తులను చిత్తు చేస్తూనే పార్టీని మరింత బలపరుస్తూ అభ్యర్థుల విజయానికి కష్టపడుతున్నారు. ఉదయం, పగలు, రాత్రి అనే తేడా లేకుండా తిరుగుతూనే ఉన్నారు. హ్యాట్రిక్ సీఎం కేసీఆర్‌ను చేయాలనే సంకల్పంతో మంత్రి కష్టపడుతున్నారు. ఈ తొమ్మిదేండ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను లెక్కలతో వివరిస్తూ ప్రతిపక్ష పార్టీలను ఓ పక్క చెడుగుడు ఆడుకుంటున్నారు. పక్క రాష్ట్రం అయిన కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది…? బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఆపార్టీ ఏం చేసింది..? అనే విషయాలను ప్రజలకు అర్థమయ్యేలా విడమరిచి చెబుతున్నారు. ఒక వైపు తాను ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజకవర్గంతో పాటు సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గాన్ని చూసుకుంటున్నారు. ఇటీవల కత్తిపోట్ల దాడిలో తీవ్రగాయాల పాలైన దుబ్బాక అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దవాఖానలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఈ నియోజకవర్గ పూర్తి బాధ్యతలు మంత్రిపైనే పడ్డాయి. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, నియోజకవర్గాలను చూసుకుంటూనే ఉమ్మడి మెదక్ జిల్లాలో పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసి మొత్తం 11 స్థానాల అభ్యర్థులను సీఎం కేసీఆర్‌కు కానుక ఇచ్చేలా మంత్రి హరీశ్‌రావు కష్టపడి పనిచేస్తున్నారు.
సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో నిర్వహించిన బీఅర్ఎస్ సభలతో మంచి జోష్ వచ్చింది. గత నెల 15న హుస్నాబాద్, 17న సిద్దిపేట, 30న నారాయణ్‌ఖేడ్‌లో నిర్వహించిన సభలకు భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మంచి రెట్టించిన ఉత్సాహంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో లక్ష ఓట్ల మెజార్టీతో సీఎం కేసీఆర్‌ను గెలిపించుకుంటామని చెప్పి పార్టీ క్యాడర్ గ్రామాల్లో విస్త్రతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సిద్దిపేటలో ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావుకు మద్దతుగా స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి వంద ఓట్లకు ఒకరు చొప్పున ఇక్కడ ఇన్చార్జిలు పనిచేస్తున్నారు. గజ్వేల్, సిద్దిపేటలో గ్రామాలకు గ్రామాలు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నాయి. దుబ్బాక నియోజకవర్గంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, సమన్వయ కమిటీలు గ్రామాల్లో విస్త్రృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ఒక్కొక్కరు ఒక కేపీఆర్ అనుకొని ప్రచారం చేస్తూ ప్రతి పక్షాలు చేస్తున్న హత్యారాజకీయాలను ప్రజలకు వివరిస్తున్నారు. హుస్నాబాద్‌లో అభ్యర్థి ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ ఇప్పటికే మెజార్టీ గ్రామాల్లో తన ప్రచారాన్ని పూర్తిచేశారు. అక్కడి క్యాడర్ ఇంటి ంటి ప్రచారం నిర్వహిస్తున్నారు. జనగామ నియోజకవర్గం పరిధిలోని గ్రామాల్లో అక్కడి అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మానకొండూరు అభ్యర్థి బాలకిషన్ తమ తమ గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. మెదక్ నియోజకవర్గంలో మెదక్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి ప్రచారంలో తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు.
వినూత్న ప్రచారం నిర్వహిస్తున్నారు. నర్సాపూర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి స్థానిక ఎమ్మెల్యే మదన్‌రెడ్డితో కలిసి గ్రామాలను చుట్టేస్తున్నారు. అందోల్ అభ్యర్థి చంటి క్రాంతి కిరణ్ తనదైన శైలిలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల ఎత్తుగడలను ఎప్పటికప్పడు కనిపెట్టుకుంటూనే వాటికి దీటుగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. నారాయణఖేడ్‌లో అభ్యర్థి ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ప్రచారంలో భాగంగా తండాలు, గ్రామాలను చుట్టేస్తున్నారు. సీఎం కేసీఆర్ సభతో ఇక్కడ పార్టీ క్యాడర్ మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నది. భారీ మెజార్టీయే లక్ష్యంగా పనిచేస్తున్నారు. జహీరాబాద్‌లో అభ్యర్థి మాణిక్‌రావు తన ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశారు. సంగారెడ్డి అభ్యర్థి చింతా ప్రభాకర్ తనదైన శైలిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన జగ్గారెడ్డి ఏం చేయలేదు కదా.. కనీసం ప్రజలకు అందుబాటులో లేరు అన్న విషయాన్ని గట్టిగా ప్రజలకు వివరిస్తున్నారు. సీఎం కేసీఆర్ మంత్రి హరీశ్‌రావు సహకారంతో ప్రజల మధ్యనే ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశాను ఆశీర్వదించండి అని ప్రజలను చింతా ప్రభాకర్ కోరుతున్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. పటాన్చెరులో అభ్యర్థి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతున్నది. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఈ ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. ఆయా ఆయా నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల ముందు చర్చ పెట్టి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జరిగే నష్టాన్ని వివరిస్తూ.. పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను వివరిస్తూ కాంగ్రెస్ లోపాలను ఎండగడుతున్నారు.