చిలిపిచెడ్, నవంబర్ 11: ధాన్యం కొనుగోళ్లలో అధికారులు జాప్యం చేయడం వల్ల రైతులకు శాపంగా మారిందని రైతు బంధు సమితి సమన్వయ కమిటీ మాజీ సభ్యుడు సయ్యద్ హుస్సేన్ అన్నారు. మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలోని బండపోతుగల్, ఫైజాబాద్, అజ్జమర్రి గ్రామాల్లో ధాన్యం బస్తాలు కాంటావేసి నాలుగు రోజులు గడుస్తున్నా లారీలు రాక ఎక్కడి ధాన్యం అక్కడే నిలిచిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
సోమవారం పీఏసీఎస్ సీఈవో పోచయ్యను రైతులు అడ్డుకొని నిరసన వ్యక్తం చేసి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి అదనపు కలెక్టర్‌కు లారీల కొరత లేకుండా చూసి ధాన్యాన్ని త్వరగా తరలించాలని వినతి పత్రం అందజేశారు. రైస్‌మిల్లుకు పోయిన లారీలను కూడా త్వరగా ఖాళీ చేయించి కేంద్రాలకు పంపించాలని కోరారు. కార్యక్రమంలో బండపోతుగల్, ఫైజాబాద్, అజ్జమర్రి గ్రామాలకు చెందిన రైతులు నర్సింహారెడ్డి, గోపాల్‌రావు, బాల్‌రాజ్ పాల్గొన్నారు
శివ్వంపేట, నవంబర్ 11 : ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయ డం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్ల ఐకేపీ కేంద్రంలో రైతులు మాట్లాడారు. కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన సన్నధాన్యాన్ని తూకం వేయడం లేదన్నారు.
ప్రభుత్వం మీద నమ్మకం లేక ఇప్పటికే 25శాతం మంది సన్నరకం ధాన్యాన్ని దళారులకు అమ్ముకున్నారని తెలిపారు. సన్నవడ్లు ఎందుకు కొనుగోలు చేయడం లేదని అధికారులను నిలదీస్తే ధాన్యానికి సైజులు, కొలతలు అని పొంతన లేని సమాధానం చెబుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం బోనస్ ఇవ్వాలని, లేకుంటే తగిన బుద్ధి చెబుతామని వారు హెచ్చరించారు