రామాయంపేట, సెప్టెంబర్04 : విద్యుత్ పోల్‌ను ఓ లారీ ఢీకొట్టిన సంఘటన రామాయంపేట మండలం రాయిలాపూర్ గ్రామంలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. రామాయంపేట -సిద్దిపేట రోడ్డు మద్యలోని నందిగామ శివారులో వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు రోడ్డు పగుళ్లు ఏర్పడడంతో రోడ్డు వెంట వాహనాలు నడవకుండా అధికారులు రోడ్డును మూసివేశారు. అప్పటి నుండి ఆ దారి నుండి వాహనాల రాకపోకలు నిలిచి పోయాయి. దీంతో సిద్దిపేట నుండి వచ్చే వాహనాలు రాయిలాపూర్ మీదుగా సుతారిరిపల్లి, ఆర్.వెంకటాపూర్ నుండి రామాయంపేటకు వస్తున్నాయి.
ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామునే మూడు గంటల ప్రాంతంలో ఓ భారీ లారీ రాయిలాపూర్ గ్రామం నుండి వస్తుండగా గ్రామంలోని విద్యుత్ పోల్‌ను ఢీకొట్టింది. పోల్ విరిగిపోవడంతో విద్యుత్ గ్రామంలో నిలిచిపోయి మంటలు లేచాయి. ఆ సమయంలో ప్రజలెవరు రోడ్డుపై లేకపోవడంతో ప్రమాదం తప్పింది. లేకుంటే పెద్ద ప్రమాదం జరిగేదని గ్రామస్తులు తెలిపారు. ప్రభుత్వం నందిగామ నుండి రామాయంపేట వరకు మద్యలో పగుళ్లు వారిన బ్రిడ్జి రోడ్డును మరమ్మతులు చేయాలని కోరారు.వారం రోజులుగా వాహనాల రాకపోకల వల్ల తమ మూడు గ్రామాల వాసులం ప్రతిరోజు తాము ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు.