జహీరాబాద్, మెదక్ ఎంపీ స్థానానికి సోమవారం జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఓటర్లు స్వచ్ఛందంగా వచ్చి ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఉదయం ఓటేసేందుకు ప్రజలు పోలింగ్ బూత్‌లకు భారీగా చేరుకున్నారు. మధ్యాహ్నం తర్వాత పోలింగ్ మందకొడిగా సాగింది. ఓటర్ల కోసం పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల అధికారులు ఎప్పటికప్పుడు ఓటింగ్ సరళిని పరిశీలించారు. హత్నూరలో రెండుచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. దివ్యాంగులు, వృద్ధుల కోసం ఎన్నికల అధికారులు ప్రత్యేక వాహన సదుపాయాన్ని కల్పించారు. సమయానికి పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఓటర్లకు సాయంత్రం 6గంటల తర్వాత కూడా ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 13