సంగారెడ్డి, సెప్టెంబర్ 30: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో శిల్పా వెంచర్ ఆక్రమణలకు సంబంధించి రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు చేపట్టిన కూల్చివేతలు అకస్మాత్తుగా నిలిపివేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. సదాశివపేట మండలం నాగ్సాన్పల్లిలో పొలాల గుండా నల్లవాగు ప్రవహిస్తుంది. జాతీయ రహదారి పక్కగా పారే నల్లవాగును శిల్పా వెంచర్ వాగు ప్రవాహం అడ్డుకునేలా అక్ర మ నిర్మాణాలు చేపట్టింది. నల్లవాగు వెడల్పు 20 మీటర్లు ఉండగా వాగుకు ఇరువైపులా తొమ్మిదిమీటర్ల చొప్పున బఫర్ ఉంది.
శిల్పా వెంచర్ మధ్యనుంచి నల్లవాగు ప్రవహిస్తుండంతో వెంచర్ యాజమాన్యం వాగు ప్రవాహాన్ని అడ్డగించి పార్కు ఇతర నిర్మాణాలు చేపట్టింది. ఫలితంగా వాగు వెడల్పు కుచించుకుపోయింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగు ఉప్పొంగి ప్రవహించింది. వాగు కుచించుకు పోవటంతో వరద నీరంతా వెంచర్లోకి రావడంతో పాటు పొలాల్లోకి ప్రవహించింది. పక్కనే ఉన్న 65వ నెంబరు జాతీయ రహదారిపైనా నల్లవాగు వరద ప్రవహించి వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.
నల్లవాగు వరదతో పంటలు మునిగిపోవడంతో రైతులు నీటిపారుదల, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. నల్లవాగును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో వాగు కుచించికుపోయిందని, సహజసిద్ధంగా పారాల్సిన జలాలు పొలాల్లోకి వస్తున్నాయని, వెంటనే అక్రమ నిర్మాణాలు తొలిగించాలని రైతులు ఫిర్యాదులో పేర్కొన్నారు. రైతుల ఫిర్యాదు మేరకు ఈనెల 27న రెవెన్యూ, ఇరిగేషన్, సర్వే ల్యాండ్, డీటీసీసీ అధికారులు సం యుక్త సర్వే చేశారు. నాలా ఆక్రమణకు గురైనట్లు సర్వేలో అధికారులు గుర్తించారు. ఎంత వరకు ఆక్రమణకు గురైంది మార్కింగ్ చేశారు.
దీంతో ఉలిక్కిపాటుకు గురైన వెంచర్ నిర్వాహకులు అడ్డుకునేందుకు యత్నించారు. పోలీసులు కేసులు పెడతామని హెచ్చరించడంతో యాజమాన్యం సైలెం ట్ అయ్యింది. అంతకుముందు అధికారులు వచ్చి సర్వే చేసి మార్కింగ్ చేస్తే సరిపోతుందని గాంభీర్యాలు పలికిన యాజమాన్యం మార్కింగ్ ప్రకారం తామే నిర్మాణాలను తొలిగించి ప్రభుత్వ నిబంధనల వరకు కూల్చివేస్తామని చెప్పి మొఖం చాటేయడంతో అధికారులే యంత్రాలను తెచ్చి కూల్చివేతల పనులు ప్రారంభించారు. ఈనెల 28న జేసీబీ యంత్రాలతో వాగుకు రెండువైపులా మార్కింగ్ చేసినంత వరకు కాలువలు తవ్వారు.
నిబంధనల మేరు బఫర్ జోన్లో ఉన్న అక్రమ నిర్మాణాలు తొలిగించాల్సి ఉండగా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. రెవెన్యూ, నీటిపారుదల శాఖల మధ్య సమన్వయ లోపమా లేక రాజకీయ ఒత్తిళ్లు కారణమో తెలియదు కాని శిల్పావెంచర్లో అక్రమ నిర్మాణాల తొలిగింపు నిలిచిపోయింది. నిబంధనల మేరకు వ్యవహరించాల్సిన అధికారులు మిన్నుకుండి పోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శిల్పా వెంచర్‌లోని అక్రమ నిర్మాణాలను తొలిగించి నల్లవాగును రక్షించాలని రైతులు కోరుతున్నారు.
శిల్ప వెంచర్లో ఆక్రమణలకు సంబంధించి ఇరిగేషన్ అధికారులు ఎంత వరకు కూల్చివేయాలని ఆదేశిస్తే అంత వరకు తొలిగిస్తామని రెవెన్యూ అధికారులు స్పష్టంచేశారు. దీంతో ఇరిగేషన్ అధికారులు వాగు విస్తీర్ణం 20మీటర్లు, రెండు వైపులా బఫర్ జోన్లో 9 మీటర్ల చొప్పున ఖాళీ స్థలం ఉండాలని సూచించారు. సర్వే అధికారులు ఆ ప్రకారం సర్వేచేసి వాగుకు రెండువైపులా మార్కింగ్ చేసి రెవెన్యూ శాఖకు కూల్చివేత పనులు అప్పగించారు.
మొదటి రోజు శనివారం వాగు ఆక్రమణలపై కూల్చివేతలు ప్రారంభంచి సాయంత్రం వరకు వాగు పొడవునా సర్వే అధికారుల మార్కింగ్ చేసిన వరకు టెంచ్లు ఏర్పాటు చేశారు. తర్వాత ఆదివారం కావడంతో పనులు నిలిపివేశారు. మరుసటి రోజు సోమవారం కూల్చివేతలు మొదలు పెట్టాల్సిన అధికారులు ఆ పక్కకు రాకపోవడంపై అధికారుల తీరుపై ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఇకపై శిల్పా వెంచర్ వ్యవహారంపై రెవెన్యూ అధికారులు స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.
నల్లవాగు కింద భాగంలో ఉన్న భూయజమాని పట్టాభూమి కొంతభాగం తక్కువగా ఉన్నట్లు మాదృష్టికి తెచ్చారు. శిల్ప వెంచర్ యాజమాన్యానికి పట్టాభూమి కోల్పోతున్నామని ఇరువురికి ఇబ్బందులు లేకుండా ల్యాండ్ సర్వే చేసి వాగును పూర్తిస్థాయిలో విస్తరించాలని కోరారు. సర్వే చేసేందుకు అధికారులు రాగానే సర్వే చేయించి ఇద్దరు భూయాజన్యాలకు పట్టా భూమి తక్కువ లేకుండా సర్వే చేసిన తర్వాత వాగును పూర్తిస్థాయిలో విస్తరిస్తాం.
వెంచర్ యాజమాన్యం అధికారులకు సహకరించేలా కింద భాగంలో ఉన్న ఫామ్‌హౌస్ యజమానితో నేను చర్చించి వాగు విస్తరణకు కోరాను. నామాటపై నమ్మకం ఉంచి వెంచర్ నుంచి 65వ జాతీయ రహదారి వరకు వాగును విస్తరించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. కేవలం సర్వేతోనే కూల్చివేతలు ఆగిపోయాయి. సర్వే పూర్తికాగానే పనులు పునఃప్రారంభిస్తాం. – సరస్వతి, తహసీల్దార్, సదాశివపేట