గజ్వేల్, మే 15: సాగు కోసం చేసిన అప్పులకుతోడు తరుచూ కాలిపోతున్న బోరు మోటరును రిపేర్ చేయించే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తూ గజ్వేల్ మండలం బంగ్లావెంకటాపూర్కు చెందిన రైతు చిగురు స్వామి(36) ఫిబ్రవరిలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటి పెద్దదిక్కు మృతితో ఆ కుటుంబ జీవన పరిస్థితిని చూసిన వారంత అయ్యే పాపం అంటున్నారు. ఇప్పుడు ఆ కుటుంబం సాయం కోసం ఎదురుచూస్తున్న ది. ఉపాధి కల్పించి ఆదుకోవాలని కోరుతున్నది. బంగ్లావెంకటాపూర్ గ్రామానికి చెందిన చిగురుస్వామి తనకున్న ఎకరం వ్యవసాయ పొలంలో 30 గుంటల్లో వరి సాగు చేశాడు. సాగు కోసం చేసిన అప్పలు అధికమవడంతోపాటు సాగు చేసిన పంట ఎండిపోవడంతో ఆశించిన దిగుబడి రాదనే బెంగతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బోరు మోటరు కాలిపోయిన సమయంలో రిపేర్ చేయడానికి సుమారుగా రూ.10వేల ఖర్చవుతుంది. రోజురోజుకూ సమస్యలు అధికమవడంతో కలతచెందిన స్వామి భార్య స్రవంతికి పొలం వద్దకు వెళ్తున్నానని చెప్పి వ్యవసాయ పొలం సమీపంలోనే చెరువు కట్టపై చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆరేండ్లలోపు వంశీ, శన్షివేశ్ ఇద్దరు కొడుకులున్న విషయాన్ని మర్చి ఆత్మహత్యకు పాల్పడడంతో అప్పుల భారం భార్య స్రవంతికి తలకుమించిన భారంగా మారి బతకడమే కష్టమవుతున్నది.
చిగురుస్వామి భార్య స్రవంతి సొంతూరు వర్గల్ మండలం అనంతగిరిపల్లి. ఉన్నత పాఠశాల దశలోనే సాఫ్ట్బాల్లో ప్రతిభను చూపించింది. గుంటూరులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో సిద్దిపేట జిల్లా జట్టు తరఫున ఆడగా మూడో స్థానంలో నిలవడంతో ఆమెను పీఈటీలు అభినందించారు. చిన్న వయస్సులోనే పెండ్లి చేయడంతో మధ్యలోనే చదువు మానేసి భర్తకు వ్యవసాయ పనుల్లో సాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంది. నా అనే వాళ్లు లేరు.. ఇద్దరు పిల్లలతో ఎలా బతికేది. రూ.ఐదారు లక్షల అప్పులు ఎలా తీర్చాలే అంటూ కంట తడిపెట్టింది. బోరు కాలిపోయినప్పుడు డబ్బులు లేక బాగు చేయించకపోతే పొలం ఎండిపొయింది. ఇద్దరు పిల్లలతో జీవనం సాగించడం కష్టంగా మారిందని, క్రీడారంగంలో ప్రతిభ ఉన్న తనకు అదేరంగంలో ఉపాధి చూపించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నది.