గుమ్మడిదల, డిసెంబర్7: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మద్యం ఏరులై పారుతున్నది. సర్పంచ్ అభ్యర్థులు పోటీపోటీగా దావత్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడానికి ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు. తెల్లవారుజామునే కోడికూయక ముందే ఇంటి తలపులు తట్టి నిద్ర లేపుతున్నారు. వరుసలు పెట్టి పలకరిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో ఎనిమిది గ్రామాల్లో జరుగుతున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో ఇదే పరిస్థితి ఉంది.
విచ్చలవిడిగా బెల్ట్‌షాపులు ఏర్పాటు కావడంతో ఎక్కడంటే అక్కడ మందు దొరుకుతున్నది. దీంతో సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు బెల్ట్ దుకాణాల్లో ఖాతాలు పెట్టారు. పైసలు,మద్యం, విందు ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. కుల సంఘాలు తమ అభ్యర్థుల గెలుపుకోసం చాపకింద నీరులా పనిచేస్తున్నాయి. దీంతో పల్లె రాజకీయం వేడెక్కింది. ఎన్నికల అధికారులు, షాడో టీం దృష్టిసారించి ప్రలోభాలపై చర్యలు తీసుకోవాలని మేధావులు కోరుతున్నారు.