రామాయంపేట, జూన్ 12 : పర్యావరణ పరిరక్షణ కోసం అడవులను కాపాడుకుందామని రామాయంపేట ఫారెస్టు రేంజ్ డిప్యూటీ ఆఫీసర్ గీత పేర్కొన్నారు. గురువారం రామాయంపేట అటవీ శాఖ కార్యాలయంలో అటవీ శాఖ పోస్టర్ను ఆవిష్కరించారు. అటవీ శాఖ చట్టాల ఉల్లంఘనకు ఎవరు పాల్పడ్డా చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అటవీ శాఖ పరిధిలో ఉన్న ప్రజలకు అడవుల రక్షణపై అవగాహన కల్పించేందుకే పోస్టర్ను ఆవిష్కరించామన్నారు.
అడవులపై దాడులకు పాల్పడుతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చట్టాల ప్రకారం జరిమానాలు విధిస్తామన్నారు. అటవీ ప్రాంతంలో చెట్లు నరకడం, మట్టి, ఇసుకను తీయడం, అటవీ భూములను చదును చేసి కబ్జాలు లాంటివి జరిగితే చట్టపరంగా కేసులు ఉంటాయన్నారు. లారీలు, ట్రాక్టర్లలో తరలించినా వాటిపై కూడా చర్యలు ఉంటాయన్నారు.