ములుగు, నవంబర్ 21: ఇదిగో పులి… అంటే అదిగో పులి..! అంటూ సిద్దిపేట జిల్లా ములుగు మండలంలో వదంతులు చక్కర్లు కొడుతున్నాయి. ములుగు మండలంలోని నర్సంపల్లి అడవుల్లో చిరుత సంచరిస్తుందన్న సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గురువారం రాత్రి ములుగుకు సమీపంలోని నర్సంపల్లి అడవుల్లో చిరుత సంచరించిందని గుర్తుతెలియన వ్యక్తులు ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఆ ఫొటో ఒకరి ద్వారా మరొకరికి చక్కర్లు కొడుతూ వైరలైంది. ఈ విషయమై ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రసాద్‌ను వివరణ కోరగా, చిరుత సంచరిస్తున్నట్లు ఎలాంటి ఆనవాళ్లు లభించలేదన్నారు. నర్సంపల్లి అడవుల్లో చిరుత సంచరించే అవకాశం లేదని, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వదంతులు అవాస్తవమని ఆయన ధృవీకరించారు.