సంగారెడ్డి, మార్చి 28(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నందికందిలో నకిలీ పత్రాలతో భూమి కబ్జాచేసి, అడ్డదారిలో భూయాజమాన్య హక్కులు పొందిన కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి శనివారం సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌కు చెందిన కస్టమ్స్ అధికారి సుబ్బారావు తన కొడుకు రవిశంకర్ పేరిట నందికందిలోని సర్వేనెంబర్ 298/అలోని 9.14 ఎకరాల భూమిని 12 డిసెంబర్,1990లో కొనుగోలు చేసినట్లు చెప్పారు.
గతేడాది జూలైలో భూకబ్జాదారులు రవిశంకర్ పేరుతో నకిలీ ఆధార్‌కార్డులను సృష్టించి, నందికందిలోని 9.14 ఎకరాల భూమిని తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా సదాశివపేట తహసీల్దార్‌పై ఒత్తిడి తెచ్చినట్లు తెలిపారు. అప్పటి సదాశివపేట తహసీల్దార్ నకిలీ ఆధార్ కార్డు, పత్రాలు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పారు. దీంతో భూ కబ్జాదారులు మరో ఎత్తుగడ వేసినట్లు తెలిపారు.
భూ యజమాని రవిశంకర్ బతికి ఉండగానే మరణించినట్లు జీహెచ్ఎంసీ నుంచి 19 మార్చి, 2020 తేదీతో నకిలీ మరణ ధ్రువీకరణ పత్రం సృష్టించినట్లు చెప్పారు. రవిశంకర్‌కు ఇద్దరు కుమార్తెలు మాత్రమే ఉండగా, లేని కొడుకును సృష్టించినట్లు తెలిపారు. రవిశంకర్ కుమారుడు పి.వెంకట్శేఖర్ అంటూ, అతని పేరిట నకిలీ ఆధార్ ఇతర పత్రాలను సృష్టించి ఈ ఏడాది మార్చిలో సదాశివపేట తహసీల్దార్, సంగారెడ్డి ఆర్డీవోకు నకిలీ పత్రాలు అందజేసిట్లు చెప్పారు.
రవిశంకర్ మృతి చెందినందున అతని కొడుకు పి.వెంకట్శేఖర్ పేరిట ఫౌతీ(భూ యాజమాన్యహక్కులు బదలాయించాలని)చేయాలని దరఖాస్తు చేసినట్లు తెలిపారు. దీంతో రెవెన్యూ అధికారులు బతికి ఉన్న రవిశంకర్ భూమి 9.14 ఎకరాల నకిలీ కొడుకు పి.వెంకట్శేఖర్కు ఫౌతీ చేశారని చెప్పారు. నకిలీ పత్రాలతో ఫౌతీ చేయించుకుని భూమి కబ్జాచేసిన వారిపై, వారికి సహకరించిన రెవెన్యూ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మంత్రి పొంగులేటికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అసలైన యజమాని రవిశంకర్ 29 జూలై,2025న సమర్పించిన పత్రాలను పరిశీలించి ఆయనకు వెంటనే కొత్త పాసు పుస్తకాలు మంజూరు చేయాలని కోరారు.