మద్దూరు(ధూళిమిట్ట), మార్చి 10: తలాపున రిజర్వాయర్ ఉన్నప్పటికీ నీళ్లు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయి. ఎండిన పంటలు పశువుల పాలవుతుండడంతో రైతులు విలపిస్తున్నారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని లద్నూర్ రిజర్వాయర్‌లోకి ఈ ఏడాది నీళ్లు విడుదల చేయకపోవడంతో రిజర్వాయర్‌లో నీటిమట్టం తగ్గిపోయింది. తత్ఫలితంగా రిజర్వాయర్ కింద బోరుబావుల్లో నీరు లేకపోవడంతో వరి పంట పొట్టదశలో ఎండిపోతుంది.
పంటలను కాపాడుకునేందుకు రైతులు ప్రయత్నాలు చేస్తున్నా ఫలించకపోవడంతో ఎండిన పంటలను పశువుల మేత కోసం వదులుతున్నారు. లద్నూర్ గ్రామానికి చెందిన రైతు ఖాజా హిదాయితుల్లా ఆరు ఎకరాల్లో వరి పంట సాగు చేశాడు. 2 బోర్లతో పాటు బావి ద్వారా నీటిని అందించేవాడు. పదిహేను రోజులుగా భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో బోరుబావుల్లో నీళ్లు లేక సుమారు మూడు ఎకరాల వరి పంట ఎండిపోయింది. పంట ఎండిపోవడంతో చేసేదేమిలేక పొలాన్ని పశువుల మేత కోసం వదిలివేశాడు. మూడు ఎకరాల వరి పంట ఎండిపోవడంతో రైతుకు రూ.లక్షపైనే నష్టం వాటిల్లింది. ప్రభుత్వం లద్నూర్ రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేసి, పంటలు కాపాడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రైతులకు కరువు అనేది తెల్వలే. కరెంట్ కష్టాలు అసలే తెల్వలే. టైమ్‌కు చెరువులు, కుంటలు నింపేది. రైతుబంధు గిట్ల ఇచ్చి రైతులను ఆదుకునేది. ఇప్పుడు రైతులకు గడ్డు రోజులోచ్చినయి. ఆరు ఎకరాల్లో వరి పంట వేస్తే మూడెకరాల్లో పంట మొత్తం ఎండిపోయింది.
తలాపునే రిజర్వాయర్ ఉన్నా దాంట్ల నీళ్లు లేవు. చుట్టుముట్టు ఉన్న గాగిళ్లాపూర్, కూటిగల్ చెరువులు కూడా ఎండిపోయినయి. మా కుటుంబమే బతుకుడు కష్టమని నిన్నమొన్ననే నాలుగు పశువులను అంగట్ల అమ్ముకొచ్చిన. నేను ఎవుసం చేసినప్పటి నుంచి పంటలు ఎండిపోవడం అనేది చూడలే. మాకు నీళ్లు ఎక్కువైతే పక్కపొంటి రైతులకు కూడా ఇచ్చేటోళ్లం. ఇప్పుడా పరిస్థితి లేదు. రెండు బోర్లు ఎండిపోయినవి. పెద్ద బాయిలో చుక్క నీరు లేకుండా పోయింది. ఇదే పరిస్థితి ఉంటే బతుకుదెరువు కోసం పట్నం బాట పట్టాల్సిందే.
– ఖాజా హిదాయితుల్లా సిద్దిఖీ, రైతు, లద్నూర్