సిద్దిపేట,ఏప్రిల్19: కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మే 20న దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మెకు బీఆర్ఎస్ పక్షాన మద్దతు తెలియజేస్తున్నట్లు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని టీటీసీ భవన్లో శనివారం నిర్వహించిన కార్మిక సంఘాల సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్మికుల శ్రమ, చెమట చుకలు లేకపోతే ఈ ప్రపంచమే నడవదని…అలాంటి కార్మికులపై కేంద్రం వైఖరి చాలా దుర్మార్గంగా ఉందన్నారు. 50 శాతం మంది కార్మికులు అంగీకరిస్తేనే యూనియన్ పెట్టాలనే కేంద్రం కొత్త కార్మిక వ్యతిరేక నిబంధనలు పెట్టిందన్నారు. బడా పారిశ్రామికవేత్తలు బ్యాంకుల నుంచి తీసుకున్న రూ. 16 లక్షల 50వేల కోట్లను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు.
కానీ కార్మికులకు రూ.16 వేల జీతం ఇవ్వమంటే… రైతులకు రుణమాఫీ చేయమంటే, కార్మికులకు ఆరోగ్య భద్రత కల్పించమంటే చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయమంటే పట్టించుకోవడం లేదన్నారు. కార్మికులకు అండగా ఉండాల్సిన కేంద్రం కార్మికులకు వ్యతిరేకంగా నాలుగు కార్మికుల కోడ్స్ తీసుకురావడం దారుణమన్నారు. రైతులకు వ్యతిరేకంగా మూడు నల్ల చట్టాలు తెచ్చి కర్షకుల ఉసురు పోసుకుందన్నారు. ఆనాడు దేశంలోని రైతులంతా ఒకటై ఢిల్లీని ముట్టడించి ఏడాదిపాటు సమ్మె చేసి చివరకు కేంద్రం మెడలు వంచారని గుర్తుచేశారు. రైతు వ్యతిరేక చట్టాలను నిలిపివేయించిన ఘనత రైతులదేనన్నారు.
రైతులు చూపిన ఐక్యతను కార్మికులు కూడా చూపించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం ఆధీనంలోని ఈఎస్ఐ దవాఖానల్లో మందులు లేవు, వైద్యులు లేరన్నారు. పీఎఫ్ రాకుంటే కార్మిక కుటుంబాలు ఎట్లా జీవనం కొనసాగించాలని ఆవేదన వ్యక్తం చేశారు.బీఆర్ఎస్ హయాంలో ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ వరర్ల జీతాలు పెంచామన్నారు.కాంగ్రెస్, బీజేపీ ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలకు రూ.18 వేల వేతనాలు ఇస్తామని చెప్పి, జీతాలు పెంచుతామని మాట ఇచ్చి అధికారంలోకి రాగానే హామీ ఇచ్చిన విషయాన్ని మర్చిపోయారన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పి ఏడాదిన్నర గడుస్తున్నా పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. ఇందిరాపార్కు వద్ద ధర్నా చేస్తామంటే పర్మిషన్లు ఇవ్వడం లేదన్నారు.
వేతనం పెంచమని అడిగితే ఆశవరర్లపై దాడిచేసి కొట్టించిన ఘనత కాంగ్రెస్‌కే దక్కిందన్నారు. కార్మిక చట్టాల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. బీడీ కార్మికుల కష్టాలు తెలిసిన కేసీఆర్ వారికి నెలకు రూ.2 వేల పింఛన్ ఇచ్చారన్నారు. దేశంలో బీడీ కార్మికులకు పింఛన్ ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కార్మికు సంఘాల నాయకులు,బీఆర్ఏటీయూ అధ్యక్షుడు రాంబాబు,బాలరాజు, మల్లారెడ్డి, మందపవన్, గోపాలస్వామి, పిండి అరవింద్, లక్ష్మణ్, నర్సింహులు, పాలసాయిరామ్, వేణుగోపాల్‌రెడ్డి,బీఆర్టీయూ నాయకులు శ్రీనివాస్, శోభన్ పాల్గొన్నారు.