కొండపాక(కుకునూరుపల్లి), డిసెంబర్ 17: అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రూ.3 లక్షల ఎల్వోసీని అందజేశారు. వివరాల్లోకి వెళితే…సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజవర్గంలోని మల్లన్నసాగర్ ముంపు గ్రామం ఎర్రవల్లికి చెందిన మ్యారమైన రజిత అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్నది. కొండపాక బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నూనె కుమార్‌యాదవ్ ఆమె అనారోగ్యం గురించి ఎమ్మెల్సీ యాదవరెడ్డి దృష్టికి తీసుకువెళ్లాడు.
ఎమ్మెల్సీ యాదవరెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు నిరుపేద కుటుంబానికి చెందిన బాధిత మహిళ రజిత వైద్యఖర్చులకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని వివరించారు. స్పందించిన కేటీఆర్ ప్రభుత్వం నుంచి రూ.3 లక్షల ఎల్వోసీని మంజూరు చేయించి ఎమ్మెల్సీ యాదవరెడ్డితో కలిసి బాధిత మహిళ భర్త మల్లేశానికి అందజేశారు. బాధిత మహిళ కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నూనె కుమార్‌యాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.