దౌల్తాబాద్, ఏప్రిల్ 10: ఉప కాల్వల నిర్మాణం పూర్తయితే ఈప్రాంతమంతా పచ్చని పంటలతో కళకళలాడుతుందని, తక్షణమే ప్రభుత్వం దృష్టి సారించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని గువ్వలేగిలో శుక్రవారం సిద్దిపేట ఆర్డీవో సదానందంతో కలిసి ఆయన రైతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉపకాల్వల నిర్మాణం, భూసేకరణ, పరిహారం వంటి అంశాలపై రైతులతో విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉప కాల్వల నిర్మాణం కేవలం ఒక అభివృద్ధి పనికాదని, అది రైతు జీవితానికి నూతన శ్వాసనిచ్చే కీలక కార్యక్రమమన్నారు. సాగునీటి సమస్యపై అసెంబ్లీ వేదికగా గళమెత్తినట్లు గుర్తుచేశారు. అసెంబ్లీలో మల్లన్నసాగర్, కొండపోచమ్మ, ఉప్పరపల్లి కెనాల్, దుబ్బాక కెనాల్ సాగునీటి సమస్యలు ప్రస్తావించి రైతుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లు వెల్లడించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రైతుల సంక్షేమానికి పాటుపడ్డామన్నారు. ప్రాజెక్టులు నిర్మించడంతో చెరువులు, కుంటలు నిండాయని, ఇప్పుడు ఉప కాలువల నిర్మాణం పూర్తి చేయడం ద్వారా సాగునీటి సదుపాయాలు మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
కాల్వల నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ, పరిహారం అంశాలపై రైతులతో చర్చ జరిపి వారి అభిప్రాయాలు తెలుసుకున్నామన్నారు. ప్రస్తుతం పరిహారం పెంపు కోసం ప్రభుత్వం, సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. రైతులకు కనీసం రూ.10 లక్షలకు పైగా పరిహారం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గ సమన్వయకర్త రణం శ్రీనివాస్‌గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రహీముద్దీన్, తహసీల్దార్ చంద్రశేఖర్‌రావు, ఎంపీడీవో అఫ్జల్, ఎంపీవో సయ్యద్ గఫూర్ఖాద్రీ, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు అల్లి శేఖర్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, రైతులు పాల్గొన్నారు.