దుబ్బాక, మార్చి 28: దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధికి సహకరించి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి విన్నవించారు. దుబ్బాక నియోజకవర్గంలో అత్యధికంగా గ్రామీణ ప్రాంతాలతో పాటు వ్యవసాయంపైనే ఆధారపడి ప్రజలు జీవిస్తున్నారని, నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని సీఎంను కోరారు. దుబ్బాకలో ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ ఏర్పాటు చేసి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. దుబ్బాక మున్సిపల్ పరిధిలో హబ్షీపూర్ నుంచి దుబ్బాక మీదుగా లచ్చపేట వరకు రోడ్డు విస్తరణ పనులకు రూ.35 కోట్లు కేటాయించాలన్నారు.
వీటికి సంబంధించిన ప్రతిపాదనలను సీఎంకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ విషయంపై ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి ‘నమస్తే తెలంగాణ’తో ఫోన్లో మాట్లాడుతూ… దుబ్బాక అభివృద్ధిలో భాగంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. హబ్సీపూర్-లచ్చపేట వరకు రోడ్డు విస్తరణ పనులకు రూ. 35 కోట్లు మంజూరు చేయాలని విన్నవించినట్లు వివరించారు. ఇందుకు సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించి, మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. వచ్చేనెలలో వాటికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఇందుకు సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.