దుబ్బాక, ఏప్రిల్ 6: కేసీఆర్ చలవతోనే దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని, తన సొంతూరు పోతారం చెరువుకు శ్రీరామనవమి రోజన కాల్వల ద్వారా సాగునీళ్లు రావడం చాలా సంతోషంగా ఉందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. తన సొంతూరుకు సాగునీళ్లు రావాలని గత శ్రీరామనవమి రోజు భగవంతుడికి వేడుకున్నానని, అతడి ఆశీస్సులతో శ్రీరామనవమి రోజునే గ్రామానికి సాగునీళ్లు వచ్చాయని ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు.
శ్రీరాముడి ఆశీస్సులు, కేసీఆర్ సహాయ సహకారాలతోనే దుబ్బాక నియోజకవర్గం సాగునీటి వెతలు తీరుతున్నట్లు తెలిపారు. 4ఎల్ డిస్ట్రబ్యూటరీ కాల్వల ద్వారా దుబ్బాక మీదుగా పోతారం పెద్ద చెరువులోకి ఆదివారం జలాలు రావడంతో ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి చెరువు వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను రైతులు సన్మానించారు. ఏడాదిగా పోరాడితే తమ గ్రామానికి గోదావరి నీళ్లు వచ్చాయని, వచ్చే శ్రీరామనవమి నాటికి దుబ్బాక నియోజకవర్గంలో అన్ని ఉప కాల్వలు నిర్మాణం జరిగి, రైతులందరికీ సాగునీరు అందాలని దేవుడికి మొక్కుకున్నట్లు ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.
దుబ్బాక నియోజకవర్గంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి స్వగ్రా మం పోతారంలో సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. 23 ఏండ్లుగా పోతారంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి దంపతులు సీతారాముల కల్యాణోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆదివారం గ్రామంలోని హనుమాన్ దేవాలయం వద్ద సీతారాముల కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
ఎమ్మెల్యే దంపతులు స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. అనంతరం యాగంలో పాల్గొన్న భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రొట్టే రాజమౌళి, ఎల్లారెడ్డి, కిషన్‌రెడ్డి, అంజిరెడ్డి, నరేశ్, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. దుబ్బాక పట్టణంలో బాలాజీ దేవాలయంలో , హనుమాన్ దేవాలయంలో స్వామివారి కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ పరిధిలోని ధర్మాజీపేట, లచ్చపేటలో, దుబ్బాక మండలంలో గంభీర్పూర్, రాజక్కపేట, ఆకారం, పెద్దగుండవెల్లి తదితర గ్రామాల్లో ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.