రెక్కాడితేగాని డొక్కాడని పేద కుటుంబం వారిది. కొడుకు అమెరికాలో ఉన్నత చదువులు చదువుతానని చెబితే అప్పులు చేసి కొడుకును అమెరికాకు పంపారు. బాగా చదువుకొని అమెరికాలో పెద్ద ఉద్యోగం సాధించి కుటుంబాన్ని పోషిస్తాడని కలలు కన్న ఆ తల్లిదండ్రుల కలలు కల్లలయ్యాయి. చెట్టంత కొడుకు దేశంకాని దేశం లో చనిపోవడంతో ఆ దంపతులు పుట్టెడు దుః ఖంలో మునిగిపోయారు. ఓవైపు కొడుకు దూరమయ్యాడనే విషాదం నుంచి కోలుకోకముందే, కొడుకు కోసం చేసిన అప్పులు వారిని మరింతగా ఆందోళనకు గురిచేస్తున్నాయి. చేసిన అప్పు లు తీరే మార్గం లేక మిగతా ఇద్దరు పిల్లలను పోషించే పరిస్థితులు లేక ఆదుకోవాలని ప్రభుత్వాన్ని, దాతలను వేడుకుంటున్నారు.
మద్దూరు(ధూళిమిట్ట), ఆగస్టు 19: సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం కూటిగల్ గ్రామానికి చెం దిన తుషాలపురం మంగ-మహదేవ్ దంపతులు ఉపాధి కోసం 20 ఏండ్ల క్రితం హైదరాబాద్కు వెళ్లి కూలీనాలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి సాయిరోహిత్, సాయినిఖిల్, సాయినిఖిత ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు సాయిరోహిత్(23) హైదరాబాద్లోని సీవీఆర్ కాలేజీలో 2022లో బీటెక్ పూర్తిచేశాడు. ఎంఎస్ చదివేందుకు 2023 డిసెంబర్లో అమెరికాలోని సియోటెల్కు వెళ్లాడు. కొడుకు చదువు కోసం తల్లిదండ్రులు రూ. 30 లక్షల అప్పు చేశారు.
ఈ ఏడాది జూలై 22న అమెరికాలో అదృశ్యమమైన సాయిరోహిత్ జూలై 24న విగతజీవిగా దొరికాడు. పదిహేను రోజుల తర్వాత ఈనెల 6న సాయిరోహిత్ మృతదేహం అమెరికా నుంచి కూటిగల్కు చేరుకుంది. స్వగ్రామంలోనే అంత్యక్రియలు పూర్తిచేశారు. సాయిరోహిత్ మృతదేహాన్ని అమెరికా నుంచి కూటిగల్కు తెప్పించేందుకు మరో రూ. 10లక్షల అప్పు అయ్యింది. చెట్టంత కొడుకు దూరం కాగా, అప్పులు వేధిస్తున్నాయి. అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సాయిరోహిత్ కేసును అక్కడి పోలీసులు నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారని, విచారణకు తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.