కోహీర్, డిసెంబర్ 26: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుకు ఓటు వేయలేదని దళితుని ఇంటిని కూల్చడం విచారకరమని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదేశాల మేరకు శుక్రవారం సజ్జాపూర్‌లో బాధిత కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. అనంతరం హరీశ్‌రావు పంచించిన లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని బాధితుడికి అందజేశారు.
ఈ సందర్భంగా మాణిక్‌రావు మాట్లాడుతూ.. జేసీబీతో ఇంటి నిర్మాణం కూల్చివేయించిన వ్యక్తులకు శిక్ష పడే వరకు పోరాడుతామన్నారు. ఈ విషయమై మాజీ మంత్రి హరీశ్‌రావు జిల్లా ఎస్పీతో మాట్లాడారని గుర్తుచేశారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య బాధితుడిని ఇటీవల పరామర్శించి, ఘటనపై వివరాలు తెలుసుకుని తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ నుంచి నిధులు మంజూరు చేయించి నూతన గృహం కట్టిస్తామని హామీ ఇచ్చారన్నారు.
తమకు తాగునీటి ఇబ్బందులను సృష్టించారని ఈ సందర్భంగా ఎస్సీ కాలనీ మహిళలు ఎమ్మెల్యే మాణిక్‌రావు దృష్టికి తెచ్చారు. వెంటనే బోరుబావిని తవ్వించి తాగునీటి ఇబ్బందులను తీర్చాలని బీఆర్ఎస్ నాయకులను ఎమ్మెల్యే ఆదేశించారు. తమకు అండగా నిలిచిన మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావుకు వారు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సింహులు, మాజీ సర్పంచులు రాజశేఖర్, రవికిరణ్, నర్సింహులు, నాయకులు రవికిరణ్, మోహన్, సంపత్‌కుమార్, భూమయ్య, ఉన్నారు.