చేర్యాల, ఫిబ్రవరి 9 : భక్తుల పాలిట కొంగు బంగారంగా సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్షేత్రం జనసంద్రంగా మారింది. నాలు గో ఆదివారం సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని పరవశించిపోయారు. స్వామి వారిని దర్శించుకునేందుకు సుమారు 40వేల మంది భక్తులు కొమురవెల్లికి తరలివచ్చినట్లు ఆలయ ఈవో రామాంజనేయులు తెలిపారు. స్వామి వా రి సన్నిధిలో మొక్కులు చెల్లించుకునేందుకు భక్తు లు శనివారం ఉదయం నుంచే మల్లన్న క్షేత్రానికి చేరుకున్నారు.
అనంతరం ఆలయ నిర్వహణలో ఉన్న గదులతో పాటు ప్రైవేట్‌గా ఉన్న గదులు అద్దెకు తీసుకుని బస చేశారు.ఆదివారం వేకువజామునే నిద్రలేచి కోనేటిలో పవిత్ర స్నానం ఆచరించి నేరుగాస్వామివారి దర్శనం కోసం క్యూలో గంటలపాటు వేచి ఉండి స్వామి వారిని దర్శించుకొన్నారు. కొంత మంది భక్తులు అర్చన, ప్రత్యేక పూజలు, కేశఖండన, నజరు, మహామండపం, చిలుక పట్నం, బోనం, టెంకాయలు, హుండీలో కానుకలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు.
మరి కొందరు భక్తులు కోరికలు నెరవేర్చాలని గంగరేగు చెట్టు వద్ద ముడుపులు, సంతానం కలగాలని మరికొందరు ఒల్లు బండ పూజలు, రాతిగీరల వద్ద మొక్కులు, కోడెను కట్టివేసి స్వామి వారిని వేడుకున్నారు.భక్తులకు మల్లన్న ఆలయ ఈవో కె.రామాంజనేయులు,పాలక మండలి సభ్యులు, ఏఈవో బుద్ధి శ్రీనివాస్, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, ఆలయ సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు సేవలు అందించారు. హుస్నాబాద్ ఏసీపీ సతీశ్ నేతృత్వంలో చేర్యాల సీఐ శ్రీను, కొమురవెల్లి ఎస్సై రాజు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.
కొమురవెల్లి మల్లికార్జునస్వామి భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు కల్యాణకట్ట వద్దకు వెళ్తే క్షురుకులు డబ్బులు ఇస్తేనే పుట్రు వెంట్రుకలు తీస్తామంటుండడంతో పలువురు భక్తులు ఈవో రామాంజనేయులుకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఈవో హుటాహుటిన కల్యాణకట్ట వద్దకు వెళ్లి భక్తుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తే ఆలయ నిబంధనల మేరకు శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. భక్తులు తలనీలాలు సమర్పించేందుకు టికెట్లు కొనుగోలు చేస్తే సరిపోతుందని డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. భక్తులను ఇబ్బందులకు గురి చేస్తే వెంటనే ఆలయ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనప్పటి నుంచి కొందరు క్షురకులు వసూళ్ల దందా కొనసాగిస్తున్నారని, వెంటనే వాటిని నియంత్రించాలని పలువురు కోరుతున్నారు.
స్వామివారి క్షేత్రంలోని ప్రధాన వీధులతో పాటు లింకు రోడ్ల పై చిరు వ్యాపారులు వ్యాపారాన్ని కొనసాగిస్తుండడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.బోనం ఎత్తుకుని మొక్కులు చెల్లించుకునేందుకు వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న భక్తులు వారికి తాకుతుండడంతో ఎక్కడ బోనం కిందపడిపోతుందననే ఆందోళనలో వారు ఇబ్బందులు పడుతూ స్వామివారి ఆలయానికి వెళ్తున్నారు. ఆలయవర్గాలతో పాటు పోలీసులు స్పందించి ప్రధాన రోడ్డుతో పాటు లింకురోడ్ల పై మార్కింగ్ వేసి దానిని దాటి రాకుండా నిబంధనలు విధిస్తే అటు వ్యాపారులతో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారికి సంబంధించిన రాగి డాలర్లను భక్తులకు ఇక నుంచి స్వామి వారి క్షేత్రంలో విక్రయించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో కె.రామాంజనేయులు తెలిపారు.ఆదివారం ఆయన రాగి డాలర్లకు సంబంధించిన బ్రోచర్‌ను ఆలయంలో విడుదల చేశారు. అనంతరం ఈవో విలేకరులతో మాట్లాడుతూ 5 గ్రాముల బరువు ఉన్న రాగి డాలర్‌ను రూ.70, 2.5గ్రాముల బరువుగల స్వామివారి డాలర్‌ను రూ.40కి విక్రయించాలని నిర్ణయించినట్లు తెలిపారు.స్వామి వారి రూపంతో తయారు చేయించిన డాలర్లను భక్తులు కొనుగోలు చేయాలన్నారు.
ఆలయ సిబ్బంది శంకర్‌శర్మ పాల్గొన్నారు.