అమీన్పూర్, నవంబర్ 16: ప్రతిపక్ష పార్టీల నేతలు ఎన్ని ట్రిక్కులు చేసినా పటాన్చెరులో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని, ముచ్చటగా మూడోసారి గూడెం మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుస్తారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గురువారం అమీన్పూర్లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గూడెం మహిపాల్‌రెడ్డి మరోసారి ఎమ్మెల్యేగా గెలవబోతున్నారని, కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారన్నారు. అధికారంలోకి వచ్చాక అమీన్‌పూర్‌కు మెట్రో రైల్‌ను నిర్మిస్తామన్నారు. ఈ ప్రాంతం కొన్నేండ్లుగా ఎంతో అభివృద్ధి చెందుతున్నదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరువు, కర్ఫ్యూలు వస్తాయన్నారు. కాంగ్రెస్ అంటేనే నాటకమని, కర్ణాటకలో 6 గ్యారంటీలు అని చెప్పి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలకు అసైన్డ్ భూముల పట్టాలు అందజేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు.
అధికారంలోకి వచ్చాక అర్హులైన పేదలకు ప్రతి ఇంటికీ సన్న బియ్యం అందిస్తామన్నారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతిఒక్కరికీ అర్థమయ్యేలా చెప్పాలన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా బీఆర్ఎస్ గాలి వీస్తున్నదని, ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అబద్ధాలకు వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని, నిజం నిలకడ మీద తెలుస్తుందన్నారు. 6 గ్యారంటీలు ఏమో కానీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 6 నెలలకు ఒకరు సీఎం అవడం ఖాయమన్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ గులాబీ జెండాలు రెపరెపలాడాలన్నారు. కేసీఆర్ మూడోసారి సీఎం అయి రికార్డు సృష్టిస్తారన్నారు. అప్పుడే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందని, అభివృద్ధి ముందుకు సాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే, పటాన్చెరు బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.