సిద్దిపేట అర్బన్, జనవరి 9 : కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు యథావిధిగా అమలు చేయాలని జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజాశర్మ అన్నారు. జిల్లా కేంద్రంలోని విపంచి కళానిలయంలో మంగళవారం జడ్పీ చైర్పర్సన్ అధ్యక్షతన జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం జరిగింది. ముందుగా నూతనంగా దుబ్బాక ఎమ్మెల్యేగా ఎన్నికై సర్వసభ్య సమావేశానికి హాజరైన ప్రభాకర్‌రెడ్డిని జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజాశర్మ, జిల్లా పరిషత్ అధికారులు సన్మానించారు. సమావేశంలో వ్యవసాయం, ఉద్యానవనశాఖ, పశుసంవర్ధకశాఖ, విద్య, వైద్యం ఆరోగ్యం, ఆయుష్, ఎన్ఆర్ఈజీఎస్, బీసీ సంక్షేమం, ఎస్సీ కార్పొరేషన్, పం చాయతీరాజ్, ఇంజినీరింగ్, ఆర్అండ్బీ, నేషనల్ హైవేస్, విద్యుత్, స్త్రీ శిశు సంక్షేమం, పౌర సరఫరాలశాఖ వంటి పలు శాఖలపై అధికారులు వారి పురోగతిని వివరించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజాభీష్టం మేరకే ప్రభు త్వం పనిచేయాలన్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను తప్పకుండా కొనసాగించాలన్నారు. గులాబీ అధినేత కేసీఆర్ ముందు చూపుతో రైతుల కోసం అనేక పథకాలు ప్రవేశ పెట్టారని..
ఇందులో భాగంగా రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలు తీసుకొచ్చారన్నారు. రైతులకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి జిల్లాలో రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్లు నిర్మించి రైతులకు సాగు నీరు అందించారన్నారు. బీడు బారిన భూములను సస్యశ్యామలంగా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన అల్పాహార పథకం, రాగిజావ పంపిణీని కొనసాగించాలన్నారు. రెండేండ్ల నుంచి సిద్దిపేట జిల్లా పదో తరగతి ఫలితాల్లో అగ్రగామిగా నిలుస్తుందని.. ఈ సంవత్సరం కూడా జిల్లా మొదటి స్థానంలో నిలిచేలా కృషిచేయాలన్నారు. దళిత బిడ్డల ఆర్థిక సాధికారత కోసం తీసుకొచ్చిన దళితబంధు పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిందని.. ఈ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించి.. అర్హులైన లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేయాలన్నారు. సమావేశంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి, జడ్పీటీసీలు, ఎంపీపీలు, అధికారులు పాల్గొన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పలు పథకాలను ఈ ప్రభుత్వం కూడా కొనసాగించాలని జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఇందులో రైతుబంధు, రైతురుణ మాఫీ పథకాలను వెంటనే అమలు చేయడంతో పాటు జిల్లాలోని రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ సభ్యు డు ప్రతిపాదించగా.. సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. గ్రామపంచాయతీల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను యథావిధిగా కొనసాగించాలని మరో బీఆర్ఎస్ సభ్యుడు ప్రతిపాదించగా.. సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దళితబంధు, గృహలక్ష్మి, రెండో విడత గొర్రెల పంపిణీ పథకాలను యథావిధిగా కొనసాగించి అర్హులైన లబ్ధిదారులకు నిధులు విడుదల చేయాలని బీఆర్ఎస్ సభ్యుడు ప్రతిపాదించగా.. సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.
రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమకావడం లేదని ఓ సభ్యుడు సభ దృష్టికి తీసుకురాగా.. దానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యుడు గత ప్రభుత్వం ఫిబ్రవరి వరకు రైతుబంధు వేసిందని చెప్పడంతో.. బీఆర్ఎస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో రైతు ఖాతాలో రూ.20, రూ.30 తమ ప్రభుత్వం ఏనాడు వేయలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే డిసెంబర్ 9వ తేదీన రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు ఎందుకు చేయలేదని సభ్యులు ప్రశ్నించారు. దీంతో కాసేపు సభలో వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 30 రోజుల్లో ఉచిత బస్సు పథకం తప్ప ఏ హామీని నెరవేర్చలేదని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని.. రాబోయే రోజుల్లో అవి ఏ విధంగా అమలు చేస్తారో చెప్పాలని సభ్యులు నిలదీశారు.
సిద్దిపేట నుంచి రామాయంపేట మీదుగా నిర్మితమవుతున్న జాతీయ రహదారి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని.. అధికారులపై ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. నూతనంగా నిర్మించిన దుబ్బాక ప్రభుత్వ పాఠశాలను సందర్శించి.. ఎలాంటి సౌకర్యాలు కావాలో సమీక్ష నిర్వహించాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. గత ప్రభుత్వంలో మంజూరైన బీసీ బంధు చెక్కులను పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రెండో విడత గొర్ల పంపిణీ కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారని.. వాటిని త్వరగా పంపి ణీ చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఆయిల్‌పామ్ రైతులకు ఉద్యానవన, వ్యవసాయశాఖ అధికారులు నిరంతరం అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యం రైస్‌మిల్లుల ద్వారా పక్కదారి పట్టకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.