గజ్వేల్, జూన్ 20: పదేండ్ల పాలనలో కేసీఆర్ రైతులకు భరోసా ఇచ్చారని, అన్ని వర్గాలను బలోపేతం చేసే దిశగా సంక్షేమ పథకాలు అమలు చేశారని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులకు యూరియా పంపిణీ చేయడంతో పాటు పండించిన ధాన్యం కొనుగోలు చేస్తే, రేవంత్‌రెడ్డి సర్కార్ యాప్ తీసుకొచ్చి కేవలం రెండు బస్తాలు మాత్రమే ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పాలన చేతకాకపోతే దిగిపోవాలని, రైతులను ఇబ్బందులకు గురి చేయవద్ద్దన్నారు.
యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేయాలంటే రైతులకు తెలియక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వ రూ.430కోట్ల బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉండగా మొద్దు నిద్రపోవడంతో మృతి చెందిన రైతులకు రైతు బీమా దక్కలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వడ్లు కొంటరా… కొనరా రైతులకు స్పష్టత ఇవ్వాలన్నారు. కల్తీ విత్తనాలు బ్లాక్ దందాలు, కాంగ్రెస్ పార్టీ డీలర్లకే ఎరువులు ఇస్తున్నారన్నారు. యాప్‌ను ఎత్తివేయని పక్షంలో ఉద్యమం చేపట్టి రైతుల్లో చైతన్యం తీసుకొచ్చి అవగాహన కల్పిస్తామన్నారు.
కూడవెళ్లి, హల్దీవాగుల్లోకి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయంలో సహకార సంఘాల ద్వారా యూరియా గ్రామాల్లోనే పంపిణీ చేశారన్నారు. నీళ్లు, నిధులు, ఉద్యోగావకాశాల కోసం ఉద్యమాన్ని కేసీఆర్ ముందుండి నడిపించారని గుర్తు చేశారు. సాగునీటి రంగాన్ని బలోపేతం చేసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి నీళ్లు అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. సమావేశంలో గజ్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ గంగిశేట్టి చందన, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మధు, నవాజ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.