చేర్యాల, జూలై 15: సిద్దిపేట జిల్లా చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాలకు చెందిన 437 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి రుణపడి ఉంటామని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ప్రకటించారు. అర్హులైన వారికి ఇండ్లు కేటాయించకుండా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులకు ఇండ్లు కేటాయించడంతో అసలు లబ్ధిదారులకు ఇండ్లు మంజూరు కాలేదు.
దీనిని గ్రహించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మంత్రులతో మాట్లాడి ఇండ్లు మంజూరు చేయిస్తే స్థానిక కాంగ్రెస్ నేతలు మంజూరు పత్రాలు ఇవ్వకుండా అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన లబ్ధిదారులు చేర్యాలలో ఐదు గంటల పాటు ఆందోళన చేయడంతో కలెక్టర్ వారికి పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా చేర్యాల ప్రాంతానికి చెందిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు మంగళవారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి సంబురాలు జరుపుకొన్నారు. అనంతరం కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కూడిన ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో నాలుగు మండలాల లబ్ధిదారులతో పాటు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.