ఖమ్మం రూరల్, మార్చి 18 : ఉద్యోగం రావడం లేదని తీవ్ర మనస్థాపనతో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని తెల్దారుపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. యువతి తల్లి ఉన్నం రమణమ్మ, రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లారుపల్లి గ్రామానికి చెందిన ఉన్నం భవాని (25) పీజీ చదివింది. కొంతకాలంగా ఇంటి వద్దే ఉంటూ పోటీ పరీక్షలకు సన్నద్ధమౌతుంది. ఎటువంటి నోటిఫికేషన్ రాకపోవడం, ఉద్యోగం ఇక రాదేమోననే బెంగతో తీవ్ర మనస్తాపం చెంది మంగళవారం ఉదయం గడ్డి మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఫలితం లేదని ఇంటికి తీసుకెళ్లమని సూచించారు. దాంతో ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం మృతి చెందింది. యువతి తల్లి రమణమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.