దుబ్బాక, ఏప్రిల్ 2 : ప్రభాకర్..బాగున్నావా, మన దుబ్బాక ఎలా ఉంది. నియోజకవర్గంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డిని తెలంగాణ తొలి సీఎం,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ముచ్చటించారు. బుధవారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ నేతలతో రజతోత్సవ మహాసభ గురించి ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశం అనంతరం దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డితో కేసీఆర్ కాసేపు ఆప్యాయంగా మాట్లాడారు. కేసీఆర్ దుబ్బాక నియోజకవర్గం గురించి, ప్రజల గురించి అడిగి తెలుసుకున్నారు. సార్.. దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు మీరంటే ఎనలేని అభిమానం ఉందని, మీతో ఆత్మీయ అనుబంధం ఉందని, మిమ్మల్ని కలవాలని పార్టీ నియోజకవర్గ శ్రేణులు ఎంతో ఆశపడుతున్నారని కేసీఆర్‌తో ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి అన్నారు. దీనికి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ తర్వాత రాష్ట్రంలో మొదట దుబ్బాక నియోజకవర్గ పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహిద్దామని చెప్పారు. రజతోత్సవ మహాసభకు దుబ్బాక నియోజకవర్గం నుంచి భారీ జనసమీకరణ చేయాలని ఎమ్మెల్యేకు సూచించారు.