మనోహరాబాద్, జనవరి 9: రాష్ట్రంలో కంటి చూపుతో బాధ పడుతున్న వారికి వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించి, వారికి అద్దాలను పంపిణీ చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మనోహరాబాద్‌లోని శుభం ఫంక్షన్హాల్లో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంపై సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులతో సోమవారం జిల్లాస్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ వివరాలతో కూడిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో కంటి చూపుతో బాధపడుతున్న నిరుపేదలు, వృద్ధులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించే గొప్ప కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ 2018లో మొదటి దశ కంటి వెలుగును ప్రారంభించారన్నారు.
రెండో విడత కంటి వెలుగుకు పక్కా ప్రణాళికలు
రెండో విడత కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పక్కా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఒక్కో బృందంలో వైద్యాధికారి, కంటి వైద్యుడు, డాటా ఎంట్రీ ఆపరేటర్‌తో కూడిన టీంలను నియమించామన్నారు. మెదక్ జిల్లాలో మొత్తం 40 బృందాలను ఏర్పాటు చేశామన్నారు. అత్యవసర సమయం, ఎక్కువ జనం ఉన్న మండలాల్లో సేవలను అందించేందుకు మరో 5 టీంలను ఏర్పాటు చేశామన్నారు. మెదక్ జిల్లాలో ఏ మండలాని ఎన్ని, ఏ మున్సిపాలిటీలకు ఎన్ని టీంలు పని చేయాలో అని పక్కా ప్రణాళికలు రూపొందించామన్నారు. టీం సభ్యులకు భోజనం తదితర అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు. వారి భోజనం, ఇతర ఖర్చులకు ఒక్కో టీంకు రోజుకు రూ. 1,500 చెల్లిస్తామన్నారు. వీరు ప్రతి గ్రామంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు ఉండి కంటి పరీక్షలు నిర్వహించి, ఆన్లైన్లో వివరాలను అప్లోడ్ చేస్తారన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసే విధంగా నోడల్ అధికారులుగా జిల్లా అధికారులే వ్యవహరించాలన్నారు. ఎంపీడీవో, తహసీల్దార్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్‌లు మండలానికి వచ్చే టీంలకు సహకరించాలని సూచించారు. ఆశా, ఏఎన్ఎంలు కూడా అందుబాటులో ఉంటారన్నారు.
పుస్తకాల రూపంలో షెడ్యూల్
జిల్లాలో ఏ గ్రామంలో టీం సభ్యులు ఎప్పుడు వస్తారో అన్ని షెడ్యూల్ వివరాలతో కూడిన పుస్తకాలను అందజేయనున్నట్లు తెలిపారు. ఎక్కడ నిర్లక్ష్యం జరిగినా ఎంపీడీవో, ఎంపీవో, పీహెచ్సీ డాక్టర్ బాధ్యులుగా ఉంటారన్నారు. రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 50 నుంచి 60 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందన్నా రు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 250 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. మండల స్థాయి అధికారులు మండల పరిషత్ మీటింగ్ ఏర్పాటు చేసి సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులకు షెడ్యూల్ ప్రకారం అవగాహన కల్పించాలన్నారు. స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లో అవగాహన కల్పించాలని సూచించా రు. క్యాంపు ఏర్పాటుకు మూడు రోజుల ముందు నుంచే గ్రామాల్లో దాటింపు, కర పత్రాల పంపిణీ, ఇంటింటి ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఫార్మట్-1, ఫార్మట్-2 అనే అంశాలపై చర్చించాలన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు కార్యక్రమ ఏర్పాటుపై సమీక్ష చేస్తుండలాన్నారు.
రేషన్ దుకాణాల వద్ద బ్యానర్లు
రేషన్ దుకాణాల వద్ద కంటి వెలుగు, గ్రామ పంచాయతీల వద్ద, వైద్య బృందం ఎప్పుడు వస్తుందో బ్యానర్లు ఏర్పా టు చేయాలన్నారు. మున్సిపల్ కౌన్సిలర్లు కూడా వారి వార్డుల్లో ఎక్కడ క్యాంపు ఏర్పాటు చేస్తే బాగుంటుందో ప్రదేశాన్ని గుర్తించాలని సూచించారు. ఆటో ద్వారా కరపత్రాలు ప్రింట్ చేసి ప్రచారం చేయాలన్నారు. క్యాంపు నిర్వాహణకు రోజుకు రూ.1,000 పంచాయతీ నిధుల నుంచి ఉపయోగించుకునే విధంగా అనుమతిస్తామన్నారు. మున్సిపాలిటీల్లో సైతం వార్డుల వారీగా వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా అందిస్తామన్నారు.
పీహెచ్‌సీలకు కొత్త వైద్యులు
రాష్ట్ర వ్యాప్తంగా పీహెచ్‌సీలకు కొత్తగా 926 మందిని, మెదక్ జిల్లా వ్యాప్తంగా 34 మంది కొత్త వైద్యులను పీహెచ్‌సీలకు పర్మినెంట్‌గా నియమించామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. వైద్య విధాన పరిషత్ నుంచి పీహెచ్‌సీలకు వైద్యులను సైతం రిక్రూట్మెంట్ చేస్తున్నామన్నారు. 2018లో కంటి వెలుగు కోసం 824 టీంలు పని చేస్తే, ప్రస్తుతం 1500 టీంలను ఏర్పాటు చేశామన్నారు. కార్లు, ఏఆర్ మిషన్, అధికారులు, రెడీగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునీతాలక్ష్మారెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మెదక్ కలెక్టర్ హరీశ్, సీఎం కేసీఆర్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహిపాల్‌రెడ్డి, ఎంపీపీల ఫో రం జిల్లా అధ్యక్షుడు కల్లూరి హరికృష్ణ, పీఏసీఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, రైతుబంధు మండల కోఆర్డినేటర్ సుధాకర్‌రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు పురం మహేశ్ ముదిరాజ్, ఎంపీపీ పురం నవనీతరవి ముదిరాజ్, వైస్ ఎంపీపీ విఠల్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.