‘కంటి వెలుగు’ శిబిరాల్లో దృష్టి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ఎంతోమంది పరీక్షలు చేయించుకునేందుకు ఉత్సాహంగా తరలివస్తున్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు వరకు వైద్యులు, సిబ్బంది టెస్ట్‌లు చేసి మందులు, రీడింగ్ గ్లాసులు అందజేస్తున్నారు. శస్త్రచిక్సితలు అవసరమైన వారిని నగరంలోని కంటి దవాఖానలకు రెఫర్ చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతి రోజూ శిబిరాల నిర్వహణను పరిశీలిస్తున్నారు. మూడో రోజు సోమవారం మెదక్ జిల్లాలో 4617 మందికి, సంగారెడ్డి జిల్లాలో 16075 మందికి పరీక్షలు చేశారు. శివ్వంపేట, వెల్దుర్తి, కొల్చారం మండలాల పరిధిలోని గ్రామాల్లో శిబిరాలను నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి సందర్శించారు. అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అల్లాదుర్గం మండలం గొల్లకుంట తండాలో, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు కోహీర్ మండలం చింతల్‌ఘాట్‌లో పర్యటించి శిబిరానికి వచ్చేవారికి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు.
మెదక్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలో రెండో విడత కంటివెలుగు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది. కలెక్టర్ హరీశ్ పర్యవేక్షణలో వైద్యారోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. సోమవారం జిల్లాలో 40 బృందాలు ఏర్పాటు చేసి, 4617 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 846 మందికి కండ్లద్దాలు అందజేశారు. జిల్లాలో ఇప్పటివరకు 14,833 మందికి పరీక్షలు చేశారు. ఇందులో 3118 మందికి కండ్లద్దాలు అందజేశారు.
ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో చందునాయక్ మాట్లాడుతూ జిల్లాలో రెండో విడత కంటివెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నదన్నారు. కంటి వెలుగు శిబరాల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రామాల్లో 9 గంటల వరకు వైద్య సిబ్బంది శిబిరాలకు వెళ్తున్నారని, సాయంత్రం 4 గంటల వరకు కంటి పరీక్షలు చేస్తున్నారని తెలిపారు. పరీక్షల అనంతరం వారి వివరాలను ట్యాబ్‌లో ఎంటర్ చేస్తున్నారని, కంటి ఆపరేషన్లు అవసరం ఉన్న వారికి వెంటనే హైదరాబాద్‌లోని కంటి దవాఖానలకు రిఫర్ చేస్తున్నారని పేర్కొన్నారు. రోజూ శిబిరాలను పర్యవేక్షిస్తున్నామన్నారు.

సంగారెడ్డి జిల్లాలో..
సంగారెడ్డి జనవరి 23 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో కంటి వెలుగు పరీక్షలు కొనసాగుతున్నాయి. సోమవారం జిల్లాలో 69 వైద్య శిబిరాల్లో కంటి పరీక్షలు నిర్వహించారు. మొత్తం 16,075 మందికి పరీక్షలు చేశారు. ఇందులో 8,432 మంది మహిళలు, 7,643 మంది పురుషులు ఉన్నారు. గ్రామాల్లో నిర్వహించిన కంటి వెలుగు వైద్య శిబిరాలకు 10,718 మంది వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. మున్సిపాలిటీల్లో 3,552 మందికి కంటి పరీక్షలు చేశారు.
జీహెచ్ఎంసీ పరిధిలో 1805 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 3,205 మందికి కండ్లద్దాలు అందజేశారు. వీళ్లలో గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు 1874 మంది, మున్సిపాలిటీలకు చెందినవారు 930 మంది, జీహెచ్ఎంసీ పరిధిలోని వారు 401 మంది ఉన్నారు. కంటి పరీక్షలు చేయించుకున్నవారిలో 1906 మందికి కండ్లద్దాలు ఆర్డర్ చేశారు. 2,201 మందికి కంటి ఆపరేషన్లు చేయించుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు. కంటివెలుగు కార్యక్రమం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 40,271 మందికి వైద్య సిబ్బంది పరీక్షలు చేశారు.