వర్గల్, ఏప్రిల్ 20 : హనుమాన్ అనుగ్రహంతోనే రాష్ట్రం సుభిక్షంగా ఉందని, మానసిక ప్రశాంతతకు నాచారం ధ్యానాంజనేయస్వామి ఆలయం తార్కాణంగా ఉందని జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అదివారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారంగుట్ట సమీపంలో వెలిసిన ధ్యానాంజనేయస్వామి ఆలయ నాలుగో వార్షికోత్సవంలో భాగంగా నిర్వహించిన యజ్ఞంలో అఖిల భారత హనుమాన్ దీక్షా పీఠాధిపతి దుర్గాప్రసాద్స్వామితో కలిసి ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలయ వ్యవస్థాపకుడు తాత నర్సింగారావు సువీశాల ప్రాంతంలో ధ్యానాంజనేయస్వామి ఆలయం నాచారంగుట్ట పరిధిలో నెలకొల్పడం హనుమాన్ భక్తులకు మహాభాగ్యమన్నారు. దుర్గాప్రసాద్స్వామి ఆశీస్సులు, హనుమంతుడి దయవల్ల బీఆర్ఎస్ పార్టీకి ఎప్పటికీ జయమే కలుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవితకు ఆలయం తరపున పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి, నాచారం ట్రస్టుబోర్డు మాజీ చైర్మన్ యాదగిరి, ఆలయ సభ్యుడు పంది నగేశ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.