కొల్చారం, సెప్టెంబర్ 3: రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి న్యాయం చేయాలని బుధవారం మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని అప్పాజిపల్లిలో రోడ్డుపై బైఠాయించి రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెదక్ హైదరాబాద్ జాతీయ రహదారి పునర్నిర్మాణం చేసే సమయంలో గ్రామంలోని మూల మలుపును సవరించే క్రమంలో వ్యవసాయభూముల మీదుగా రోడ్డు నిర్మాణం చేపట్టారన్నారు.
ఈ నిర్మాణంలో గ్రామానికి చెందిన 40 మంది రైతుల నుంచి సుమారు 30 గుంటల పట్టాభూమిని సేకరించారన్నారు. దీనికి బదులుగా అప్పటి ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మలుపుతిరిగిన పాతరోడ్డు స్థలాన్ని సాగుచేసుకోమని చెప్పారన్నారు. రెండు రోజుల్లో భూములు ఇచ్చిన రైతులకు పాతరోడ్డు స్థలానికి సంబంధించిన ధ్రువపత్రాలు అందజేస్తామని చెప్పినా ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు.
రెవెన్యూ సిబ్బంది సదరు పాత రోడ్డు స్థలంలో కడీలుపాతి ప్రభుత్వ బోర్డు ఏర్పాటు చేయటానికి సిద్ధపడ్డారని మండిపడ్డారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న డిప్యూటీ తహసీల్దార్ నాగవర్ధన్, ఎస్సై మొయినొద్దీన్ ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని డిప్యూటి తహసీల్దార్ తెలిపారు.