మెదక్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో న్యాయం గెలిచిందని, పీసీ ఘోష్ కమిషన్‌పై హైకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు అర్థం చెప్పింది. బుధవారం కాళేశ్వరం బ్యారేజీ నిర్మాణంలో అవకతవకలు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం వేసిన కేసు విచారణలో పీసీ ఘోష్ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని హైకోర్టు పేర్కొన్నదని తీర్పు రావడం హర్షణీయం.
– పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు
దుబ్బాక, ఏప్రిల్ 22: జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక చెల్లుబాటు కాదని, దానిపై తదుపరి చర్య లు తీసుకోవద్దని హైకో ర్టు ఇచ్చిన తీర్పు సరి యైంది. కమిషన్స్ ఆఫ్ ఎంక్వయిరీ యాక్ట్ లోని ప్రకారం ఎవరి మీదైనా అభియోగాలు మోపేముందు వారి అభిప్రాయాలు రికార్డు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. నివేదిక పూర్తికాకముందే అసెంబ్లీలో చర్చించడం, మీడియా కు లీకులు ఇవ్వడం వెనుక ముమ్మాటికీ కుట్ర దాగి ఉంది. కమిషన్ల పేరుతో కక్ష సాధింపు రాజకీయాలు చేయడం సరైన విధానం కాదు.
– కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే, దుబ్బాక
చేర్యాల, ఏప్రిల్ 22: కక్ష సాధింపు రాజకీయాలపై ధర్మం గెలిచింది. హైకోర్టు తీర్పు రేవంత్ సర్కారుకు చెంపపెట్టు. నిజం ముందు కుట్రలు కూలిపోయాయి. కేసీఆర్, హరీశ్‌రావుపై ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమైనవి. మేడిగడ్డ ఘటనతో మొత్తం ప్రాజెక్టును దూషించడం తగదు. రెండున్నరేండ్లుగా మరమ్మతులు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నాం. కాంగ్రెస్ రాజకీయ కోణంలో కమిషన్ ఏర్పాటుచేసి వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి ఇకనైనా తన వక్రబుద్ధి మానుకోవాలని సూచిస్తున్నాం. కక్ష సాధింపు రాజకీయాలు, దుష్ప్రచారాలు మానుకుని రైతుల ప్రయోజనాల కోసం పనిచేయాలి.
– పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే, జనగామ
నర్సాపూర్, ఏప్రిల్ 22: కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ఘోష్ కమిషన్ పనితీరును బహిర్గతం చేసింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్‌రెడ్డికి చెంపపెట్టులాంటిది. ఘోష్ కమిషన్ పేరుతో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వేధించడం కక్షపూరిత చర్య. కొన్ని రోజులు కాళేశ్వరం పేరుతో, మరికొన్ని రోజులు ఫార్ములా ఈ రేస్ పేరుతో, ఇంకొన్ని రోజులు ఫోన్‌ట్యాపింగ్ అంటూ ప్రజల దృష్టి మళ్లించే డైవర్షన్ రాజకీయాలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటైపోయింది. హామీలు అటకెక్కించే ప్రయత్నంలో ప్రజలను మభ్యపెట్టేందుకు ఇలాంటివి చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎల్లప్పుడు తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి వారి హక్కుల కోసం పోరాడుతుంది.
– సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే నర్సాపూర్
సంగారెడ్డి, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పు హర్షనీయం. కేసీఆర్, హరీశ్‌రావును ఇబ్బంది పెట్టేందుకు కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్‌రెడ్డి ఏర్పాటు చేసిన ఘోష్ కమిషన్ వ్యాఖ్యలు చెల్లవని హైకోర్టు తీర్పు ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కోర్టు ఇచ్చిన తీర్పు బీఆర్ఎస్, తెలంగాణ రైతాంగానికి దక్కిన నైతిక విజయం. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక పీసీసీ రాసిచ్చిన స్క్రిప్ట్ అని బీఆర్ఎస్ మొదటి నుంచి చెబుతున్నది. చివరికి అదే నిజమని కోర్టు తీర్పుతో తేలింది. మూడేళ్లుగా రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలు, రాజకీయ డ్రామాలన్నీ హైకోర్టు తీర్పుతో బట్టబయలయ్యాయి.
– చింతా ప్రభాకర్, ఎమ్మెల్యే, సంగారెడ్డి
గజ్వేల్, ఏప్రిల్ 22: కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన ఘోష్ కమిషన్ ట్రాష్ అని, కమిషన్ ఇచ్చిన నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంప పెట్టు. కేసీఆర్, హరీశ్‌రావుపై కాంగ్రెస్ చేసిన కుట్రపూరిత కేసులతో భయపడే ప్రసక్తే లేఊదు. రేవంత్‌రెడ్డి ఎన్ని ఆటంకాలు, అవరోధాలు సృష్టించినా తెలంగాణ ప్రజల దీవెనలతో కేసీఆర్‌కు అంతా మంచే జరుగుతుంది. అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గడిచినా రెండు పిల్లర్ల మరమ్మతు చేయలేని దద్దమ్మ ప్రభుత్వం.
– డాక్టర్ యాదవరెడ్డి, ఎమ్మెల్సీ
గజ్వేల్, ఏప్రిల్ 22: కాళేశ్వరంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయి రావా లి. కుట్రలో భాగంగానే కాంగ్రెస్‌వారు బాంబులు పెట్టి కుల్చిం ది. ఘోష్ కమిషన్ తెలంగాణ ఉద్యమకారుడిని విచారణకు పిలిపించి కొండను తవ్వి ఎలుకను పట్టింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు. రెండు పిల్లర్ల మరమ్మతులు చేసే చేతకాని రేవంత్‌రెడ్డి, ఉత్తమకుమార్‌రెడ్డి ఉత్తర ప్రగాల్భాలు పలుకుతున్నారు.
– వంటేరు ప్రతాప్‌రెడ్డి, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి