సంగారెడ్డి నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా కొల్లూరులోని డబుల్బెడ్రూమ్ ఇండ్లలో నివాసం ఉంటున్న జూబ్లీహిల్స్ ఓటర్లను మచ్చి క చేసుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తుంది. డబుల్బెడ్రూమ్ ఇండ్లలో సుమారు 5వేల మందికిపైగా ఓటర్లు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి అటువైపు కన్నెత్తి చూడని మంత్రులు దామోదర్ రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కొల్లూరులోని కేసీఆర్‌నగర్‌లోని డబుల్బెడ్రూమ్ టౌన్షిప్లో పర్యటించారు. మంత్రుల పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు నిరసనలు తెలియజేసేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని ముందస్తుగా అరెస్టు చేశారు. కేసీఆర్ సర్కార్ పేదల కోసం ఆసియాలోనే అతిపెద్ద టౌన్‌షిప్‌ను కొల్లూరులో నిర్మించింది.
రూ.1432.50 కోట్లతో ఒకేచోట 15,6 60 డబుల్బెడ్రూమ్ ఇండ్లను కేసీఆర్ ప్రభుత్వం నిర్మించింది. మొత్తం 117 బ్లాక్‌లు, G +9 నుంచి G+10, G+11 వర కు అంతస్తులు నిర్మించారు. ప్రతి బ్లాక్‌కు రెండు లిఫ్టులు, తాగునీటి వ్యవస్థ, మురుగునీటి శుద్ధిప్లాంట్, 118 వాణిజ్య దుకాణాలు, దవాఖానను కేసీఆర్ సర్కార్ ఏర్పాటు చేసింది. జూన్, 2023లో కేసీఆర్ డబుల్బెడ్రూమ్ టౌన్‌షిప్‌ను ప్రారంభించి ఇండ్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. కేసీఆర్ నగర్లో నిర్మించిన 15,660 ఇండ్లను గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ప్రాంతాల్లోని పేదలకు కేసీఆర్ ప్రభుత్వం పంపిణీ చేసింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని పేదలకు సైతం కేసీఆర్‌నగర్‌లోని డబుల్బెడ్రూమ్ టౌన్‌షిప్‌లోనే ఇండ్లు కేటాయించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి హరీశ్‌రావు, దివంగత ఎమ్మెల్యే గోపీనాథ్ స్వయంగా జూబ్లీహిల్స్‌లోని పేదలకు డబుల్బెడ్రూమ్ ఇండ్ల పత్రాలు అందజేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడుస్తుంది. ఈరెండేండ్లలో మంత్రులు కొల్లూరులోని డబుల్బెడ్రూమ్ వైపు కన్నెత్తి చూడలేదు. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక డబుల్బెడ్రూమ్ ఇండ్లలోని లబ్ధిదారులు తాగునీరు, పారిశుధ్యం, రవాణా తదితర సమస్యలు ఎదుర్కొంటున్నారు. రేషన్‌దుకాణాలు లేకపోవటంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. డబుల్బెడ్రూమ్ ఇండ్లలో నివాసం ఉంటున్న పేదలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రభుత్వం దృష్టి కేసీఆర్‌నగర్‌లోని డబుల్బెడ్రూమ్ టౌన్షిప్లో నివాసం ఉంటున్న ఓటర్లపై పడింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన సుమారు 3వేల కుటుంబాలకు కేసీఆర్ నగర్‌లోని డబుల్బెడ్రూమ్ టౌన్షిప్లో ఇండ్లు ఇచ్చారు. జూబ్లీహిల్స్ చెందిన పేదలు తమకు కేటాయించిన డబుల్బెడ్రూమ్ ఇండ్లలో నివాసం ఉంటున్నా వారి ఓట్లను పటాన్చెరు నియోజకవర్గానికి మార్పించలేదు.
ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రావటంతో కాంగ్రెస్ దృష్టి డబుల్బెడ్రూమ్ ఇండ్ల్లలో నివాసం ఉంటున్న సుమారు 5వేల మందిపై పడింది. డబుల్బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులు అద్దెకు ఇచ్చారంటూ అధికారులు ఇటీవల నోటీసులు జారీ చేశారు. దీంతో లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. సోమవారం మంత్రులు దామోదర్, పొంగులేటి డబుల్బెడ్రూమ్ టౌన్షిప్లో పర్యటించారు. రూ.7.50 కోట్లతో నిర్మించనున్న స్కూల్ భవనం, పార్కు, గ్రేవ్‌యార్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా డబుల్బెడ్రూమ్ ఇండ్లలో నివాసం ఉంటున్న లబ్ధిదారులు సమస్యలను మంత్రులకు వివరించారు. త్వరలోనే అన్ని సమస్యలు పదిరోజుల్లో పరిష్కరిస్తామని మం త్రులు హామీ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఓటర్లను కాంగ్రెస్ నాయకులు కలిసి తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం.