సంగారెడ్డి, జనవరి 30(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వలస పోయిన నేతల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సంగారెడ్డి, సదాశివపేట, అందోలు-జోగిపేట, నారాయణఖేడ్ మున్సిపాలిటీల్లోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు, పట్టణ ముఖ్యనాయకులు ప్రలోభాలకు గురై కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో మీకు కౌన్సిలర్ టికెట్లు ఇచ్చి గెలిపించుకుంటామని కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలుగా పోటీచేసిన అభ్యర్థులు బీఆర్ఎస్లోని కొంతమంది కౌన్సిలర్లు, పట్టణ ముఖ్య నాయకులకు హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల హామీలను నమ్మి సంగారెడ్డి, సదాశివపేట, జోగిపేట, నారాయణఖేడ్ మున్సిపాలిటీల్లో కొంతమంది కౌన్సిలర్లు బీఆర్ఎస్కు ద్రోహం చేసి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో మున్సిపల్ ఎన్నికల్లో తమకు కాంగ్రెస్ కౌన్సిలర్లు టికెట్లు దక్కడం ఖాయమని వలస నేతలు భావించారు. కానీ, వలస నేతల ఆశలు అడియాసలు అయ్యాయి. చాలామంది వలస నేతలకు టికెట్లు దక్కలేదు. దీంతో నాడు టికెట్లు ఇస్తామని ఆశచూపి ఇప్పుడు మొండిచేయి చూపుతారా అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలపై వలస నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో తమ ప్రతాపం చూపుతామని వలస నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సంగారెడ్డిలో బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన నాయకులకు కౌన్సిలర్ టికెట్లు దక్కలేదు. గురువారం కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను ప్రకటించారు. కాంగ్రెస్ ప్రకటించిన జాబితాలో వలస నేతలకు కౌన్సిలర్ టికెట్లు ఇవ్వలేదు. సంగారెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బొంగుల విజయలక్ష్మితో పాటు ఆమె భర్త బొంగుల రవి, మాజీ కౌన్సిలర్లు ఉమామహేశ్వరి, చంద్రశేఖర్, స్వప్న నర్సింలు, అమీర్‌బేగ్, వెంకటేశ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కాంగ్రెస్‌లో చేరికల సమయంలో విజయలక్ష్మీతో పాటు మరో ఐదుగురు మాజీ కౌన్సిలర్లకు కౌన్సిలర్ టికెట్లు ఇవ్వస్తామని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హామీ ఇచ్చారు. అంతేకాకుండా మివ్వల్ని గెలిపించుకునే బాధ్యత తమదేనని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హామీ ఇచ్చారు. కానీ, తీరా.. ఆ ఆరుగురు మాజీ కౌన్సిలర్లలో ఎవ్వరికీ కాంగ్రెస్ టికెట్లు ఇవ్వలేదు. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బొంగుల విజయలక్ష్మీ రవి తనవార్డు ఎస్సీ రిజర్వు కావటంతో పట్టణంలో రిజర్వేషన్ అనుకూలంగా రెండువార్డుల్లో పోటీచేస్తానని, టికెట్ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని కోరారు. ఆయన టికెట్ ఇచ్చేందుకు నిరాకరించినట్లు సమాచారం. బొంగుల విజయలక్ష్మీ భర్త రవికి సంగారెడ్డి మున్సిపాలిటీల్లో బలమైన పట్టు ఉంది.
విజయలక్ష్మీ తిరిగి పోటీచేస్తే ఎన్నికలను ప్రభావితం చేయడంతో పాటు చైర్మన్ పదవికి పోటీకి వస్తారని విజయలక్ష్మికి టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ నిరాకరించినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ టికెట్ ఇవ్వకపోవటంతో నిరాశకు గురైన బొంగుల విజయలక్ష్మీ రెబెల్‌గా పోటీచేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న జగ్గారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని, రాష్ట్రస్థాయిలో ఏదైనా పదవి ఇప్పిస్తానంటూ హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్‌లో చేరిన మాజీ కౌన్సిలర్లు చంద్రశేఖర్, స్వప్ననర్సింలు, ఉమామహేశ్వరి అమీర్‌బేగ్, వెంకటేశంకు కౌన్సిలర్ టికెట్లు దక్క లేదు. ఇందులో స్వప్ననర్సింలుకు బీఆర్ఎస్ మళ్లీ బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడంతో బరిలో ఉన్నారు.
సదాశివపేట మున్సిపాలిటీలో ముగ్గురు బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరారు. ముగ్గురిలో ఒక్కరికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ టికెట్ ఇచ్చింది. మిగతా ఇద్దరికి టికెట్ దక్కపోవడంతో నిరాశలో ఉన్నారు. నారాయణఖేడ్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ముగ్గురు మాజీ కౌన్సిలర్లకు కాంగ్రెస్ టికెట్లు దక్కలేదు. అందోలు మున్సిపాలిటీ మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లయ్యతో పాటు నలుగురు మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరారు. మల్లయ్యకు కౌన్సిలర్ టికెట్ ఇవ్వగా, మిగతా నలుగురికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు.