చేర్యాల, జనవరి 31: ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్.. తీరా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని కిష్టంపేట గ్రామ ఫంక్షన్ హాలులో శనివారం చేర్యాల పట్టణం, చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాలకు చెందిన బీఆర్ఎస్, సీపీఎం ముఖ్య నాయకులు,కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల విజయం కోసం గులాబీ సైనికులు సీపీఎం పార్టీ శ్రేణులతో కలిసి ఐక్యంగా పని చేయాలని, విస్తృతంగా ప్రచారం సాగించాలని ఎమ్మెల్యే పల్లారాజేశ్వర్‌రెడ్డి, సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడి నిర్ణయించారు.
ఎన్నికల విజయం కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ.. చేర్యాల ప్రజల చిరకాల స్వప్నమైన రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అలస్యం చేస్తుందో చెప్పాలన్నారు. ఎంపీగా ఉన్నప్పుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేర్యాల డివిజన్ ఏర్పాటు కోసం దీక్ష చేసిన విషయాన్ని గుర్తు చేశారు.పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి సైతం డివిజన్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చాడన్నారు. కానీ, ఏర్పాటు చేయడం లేదన్నారు. చేర్యాల మున్సిపాలిటీ అభివృద్ధి బీఆర్ఎస్తో సాధ్యమన్నారు.
బీఆర్ఎస్ పాలనలో మంజూరైన నిధులతో కమర్షియల్ కాంప్లెక్స్, దవాఖాన భవనాలు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు, రోడ్డు విస్తరణ తదితర పనులు చేపట్టినట్లు తెలిపారు.పట్టణంలో పెండింగ్ పనులు పూర్తి చేయడంలో కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం వహిస్తున్నదని విమర్శించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల సమన్వయకర్త ఎల్లు రవీందర్‌రెడ్డి, బీఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు ముస్త్యాల నాగేశ్వర్రావు, సీపీఎం టౌన్ కార్యదర్శి రాళ్లబండి నాగరాజు, సర్పంచ్ల పోరం మండల అధ్యక్షుడు నర్ర ఉపేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు అంకుగారి శ్రీధర్‌రెడ్డి, మద్దూరు మండల అధ్యక్షుడు, మేక సంతోష్, మాజీ ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్,ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ పుర్మ వెంకట్‌రెడ్డి, వకులాభరణం నర్సయ్యపంతులు, బీఆర్ఎస్, సీపీఎం ముఖ్య నాయకులు, అభ్యర్థులు పాల్గొన్నారు.