సదాశివపేట, అక్టోబర్ 30: ప్రజలకు ఓటు అడిగే నైతిక హక్కు ఎమ్మెల్యే జగ్గారెడ్డికి లేదని, మంత్రి హరీశ్‌రావును విమర్శించే స్థాయి జగ్గారెడ్డికి లేదని టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ అన్నారు. ఆదివారం రాత్రి మండల పరిధిలోని నాగ్సాన్పల్లి, నందికంది గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో మహిళలు మంగళహారతులు, కార్యకర్తలు పూలవర్షంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో లేక ప్రజాసేవ, పరిపానలలో జగ్గారెడ్డి ఐదేండ్లు పూర్తిగా విఫలమయ్యారన్నారు. మంత్రి హరీశ్‌రావు గోటికి కూడా జగ్గారెడ్డి సరిపోరని ఫైర్ అయ్యారు. సంగారెడ్డికి జగ్గారెడ్డి ఎన్ని సార్లు వచ్చారో, ఎన్నిసార్లు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారో, సంగారెడ్డికి ఎన్ని నిధులు తెచ్చారో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.
ప్రజల కోసం ఎల్లప్పుడూ ఆలోచించే వ్యక్తి చింతా ప్రభాకర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. చింతా ప్రభాకర్ మాట్లాడుతూ తన ఆరోగ్యం కోసం చర్చిలు, మసీదు, దేవాలయాల్లో ప్రార్థనలు చేశారని, అందుకే మీ ముందు ఉండి మాట్లాడుతున్నారన్నారు. నిండు మనస్సుతో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, మనబిన్ ఫౌండేషన్ చైర్మన్ ఎంఏ ముఖీమ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెద్దగొల్ల ఆంజనేయులు, నందికంది సర్పంచ్ కుందెనరాజు, నాగ్సాన్పల్లి సర్పంచ్ లక్ష్మీచంద్రశేఖర్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.