గుమ్మడిదల, ఫిబ్రవరి 28: డంపింగ్ యార్డుతో ప్రజల పచ్చని బతుకులు ఆగం చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఇక్కడి నుంచి డంపింగ్ యార్డు హఠావో- గుమ్మడిదల బచావో నినాదాలతో రిలే నిరాహార దీక్ష మార్మోగింది. శుక్రవారం గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో గుమ్మడిదల జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో నవజ్యోతి మాల యువజన సంఘం సభ్యులు 18వ రోజు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు.
నల్లవల్లి, కొత్తపల్లి గ్రామాల్లో 24వ రోజు రిలే నిరాహార దీక్షలో అంబేద్కర్ సంఘం సభ్యులు కూర్చున్నారు. దీక్షలో కూర్చున్నవారికి మాజీ జడ్పీటీసీ కుమార్ గౌడ్, జేఏసీ నాయకుడు గోవర్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్ చిమ్ముల నర్సింహారెడ్డి పూలదండలు వేసి స్వాగతించారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. 24 రోజులుగా డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు.
ఇచ్చిన అనుమతులు రద్దు చేసే వరకు ఆందోళనలు ఆగవని హెచ్చరించారు. ఇక్కడి ప్రజల మనోభావాలను దెబ్బతీయకుండా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర, రాష్ట్ర అటవీ శాఖ, పీసీబీ, పర్యావరణ శాఖ స్పందించి వెంటనే డంపింగ్ యార్డు అనుమతులు రద్దు చేసి ఇక్కడి ప్రజల క్షేమాన్ని కోరుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆంజనేయులు యాదవ్, నల్తూరు యాదగిరి, రమేశ్, కుమ్మరి ఆంజనేయులు, ఫయాజ్ షరీఫ్, రామకృష్ణ, సురేశ్, ఆకుల సత్యనారాయణ, తేలు నర్సింహ, సంజీవరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి ఉన్నారు.
డంపింగ్ యార్డును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విరమించుకునేలా కృషి చేయాలని జేఏసీ నాయకులు మెదక్ ఎంపీ రఘునందన్‌రావును కలిసి వినతిపత్రం అందజేశారు. శుక్రవారం గుమ్మడిదల, నల్లవల్లి, కొత్తపల్లి, ప్యారానగర్ తదితర గ్రామాలకు చెందిన జేఏసీ నాయకులు ఎంపీ రఘునందన్‌రావును ఆయన స్వగృహంలో కలిశారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ప్యారానగర్ అటవీ ప్రాంతంలో జీహెచ్ఎంసీ అధికారులు చేపట్టిన డంపింగ్ యార్డు వల్ల ఇక్కడి గ్రామాల ప్రజల బతుకులు ఆగమైతాయని ఎంపీకి విన్నవించారు.
దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. చట్టప్రకారం డంపింగ్ యార్డును ఆపవచ్చని సూచించారు. దీనికి సంబంధించిన పలు సూచనలు ఎంపీ జేఏసీ నాయకులకు వివరించారు. శాంతియుతంగా ఆందోళనలు చేయాలని సూచించారు. సర్కారు, పోలీసులు కవ్వింపు చర్యలకు పాల్పడాలని యత్నించినా శాంతియుత మార్గంలో నిరసనలు చేయాలని సూచించారు.
అటవీశాఖ అధికారులతో ఎంపీ ఫోన్లో సంభాషించారు. వచ్చే సోమవారం రాష్ట్ర అటవీ శాఖ కార్యాలయంలో కలిసి ఇక్కడి ప్రజలు ఇబ్బందులు, పర్యావరణ సమస్యలు, గాలి, నీరు కలుషితమయ్యే పరిస్థితులను వివరించనున్నట్లు ఎంపీ తెలిపారు. తన సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ఎంపీని కలిసిన వారిలో జేఏసీ అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి, రామకృష్ణ, సురేశ్, కావలి ఐలయ్య, చెన్నంశెట్టి ఉదయ్‌కుమార్, నాగేందర్ గౌడ్, నర్సింగ్‌రావు, ప్రతాప్‌రెడ్డి, జయశంకర్ గౌడ్, రవీందర్‌రెడ్డి, కొత్తపల్లి ప్రభాకర్‌రెడ్డి, మద్దుల బాల్‌రెడ్డి, మాజీసర్పంచ్ శంకర్, రాంరెడ్డి, రాజీరెడ్డి, కిరణ్‌కుమార్ శర్మ, యాదగిరి, కరుణాకర్, సత్యనారాయణ ఉన్నారు.