Gummadidala | గుమ్మడిదల, మార్చి11 : ప్యారానగర్ డంపింగ్‌యార్డుకు వ్యతిరేకంగా ఇక ఉమ్మడిపోరుకు సిద్ధమని రైతు జేఏసీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ప్యారానగర్ సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులతో జీహెచ్ఎంసీచే రాంకీ చేపట్టిన డంపింగ్‌యార్డును వెంటనే రద్దు చేయాలని మంగళవారం గుమ్మడిదలలో 2000-2001 ఏడాది పదో తరగతి పూర్వవిద్యార్థులు రిలే నిరహారదీక్ష చేపట్టారు. దీనికి రైతు, మహిళాజేఏసీ నాయకులు సంఘీభావం తెలిపారు. నల్లవల్లి, కొత్తపల్లి గ్రామాల్లో గ్రామస్తులు కొనసాగిస్తున్న రిలే నిరహారదీక్షలు 35వ రోజుకు చేరుకున్నాయి.
ఈసందర్భంగా 2001 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు, జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. డంపింగ్‌యార్డుపై ఇక నర్సాపూర్, శివంపేట, గుమ్మడిదల మండలాలతో పాటు ఉమ్మడిమెదక్ జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి పోరుకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. డంపింగ్‌యార్డు వల్ల ఇక్కడి గ్రామాల ప్రజలు ఉపాధి కోల్పోతారని, వ్యవసాయం చేయలేక ఉపాధి కోసంవలసలు పోవలసి వస్తుందని, గాలి, నీరు, నేల కలుషితమై నర్సాపూర్ రాయచెరువుతో పాటు సమీపంలో ఉన్న గొలుసు కట్టు చెరువులె కలుషితమైతాయని ఆందోళనలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమన్నారు. ఇక్కడిప్రజలు క్షేమాన్ని పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం ఇక రాష్ట్ర ప్రజల క్షేమం ప్రశ్నార్ధకమైతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
జీహెచ్ఎంసీ, జిల్లా అధికారులతో రాష్ట్ర పాలకులు చర్చించి వెంటనే ప్యారానగర్ డంపింగ్‌యార్డును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నల్లవల్లిలో కొనసాగుతున్న రిలే నిరహారదీక్షకు గుమ్మడిదల జేఏసీ నాయకుడు పీ. శ్రీనివాస్‌రెడ్డి రూ.20 వేలు విరాళం అందజేశారు. గుమ్మడిదల రిలే నిరహారదీక్షలు కొనసాగడానికి ఆర్యవైశ్య సంఘం రూ.10 వేలు విరాళం అందజేశారు. ఈకార్యక్రమంలో రైతు జేఏసీ నాయకులు గోవర్ధన్‌రెడ్డి, మాజీజడ్పీటీసీ కుమార్‌గౌడ్, రైతు సంఘం అధ్యక్షుడు సదానందరెడ్డి, పోచుగారి శ్రీనివాస్‌రెడ్డి, జేఏసీ నాయకులు దోమడుగు బాల్‌రెడ్డి, మందబలరాంరెడ్డి, చిమ్ముల నర్సింహారెడ్డి, కుమ్మరి ఆంజనేయులు, రామకృష్ణ, కొత్తపల్లి మల్లేశ్‌గౌడ్, రాజుగౌడ్, మహిళారైతు జేఏసీ నాయకులు, యువకులు పాల్గొన్నారు.