Iran nuclear deal : ఇరాన్ సంక్షోభం నేపథ్యంలో తమతో అణు ఒప్పందం చేసుకోవాల్సిందే అంటూ అమెరికా ఒత్తిడి తెస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్ స్పందించింది. కొన్ని అంశాల్లో రాజీ పడి అమెరికాతో అణు ఒప్పందం చేసుకునేందుకు సిద్ధమని ప్రకటించింది. అయితే, అమెరికా తమ దేశంపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని షరతు విధించింది. ఇటీవల అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్నాయి. తాము చెప్పినట్లు నడుచుకోకపోతే ఇరాన్‌పై దాడి చేస్తామని ఇటీవల అమెరికా హెచ్చరించింది.
ఇరాన్లో కొంతకాలంగా ఆందోళన చేస్తున్న నిరసనకారుల్ని ఉరి తీయొద్దని, వారిపై దాడులు ఆపాలని కూడా అమెరికా సూచించింది. అలాగే తమతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అమెరికా యుద్ధ నౌకలు ఇరాన్‌వైపు కదులుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇరాన్ ఒక మెట్టు దిగినట్లు కనిపిస్తోంది. ఈ అంశంపై ఇరాన్ విదేశాంగ మంత్రి మాజిద్ తఖ్త్ రావంచి తాజాగా బీబీసీతో మాట్లాడారు. అమెరికా కోరుతున్నట్లు అణు ఒప్పందానికి సిద్ధమన్నారు. ‘‘అణు ఒప్పందం విషయంలో అమెరికా నిజాయితీగా ఉంటే మేం కూడా ఒప్పందానికి సిద్ధం. అయితే, ఇరాన్‌పై విధించిన ఆంక్షలను అమెరికా ఎత్తివేయాలి. ఈ ఒప్పందం విషయంలో చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సింది అమెరికానే. ఆ దేశం చేతుల్లోనే నిర్ణయం ఉంది. వాళ్లు మా షరతులకు అంగీకరిస్తేనే మా అణు కార్యక్రమాలపై చర్చించగలం’’ అని మాజిద్ అన్నారు.
ఇరు దేశాల మధ్య దీర్ఘకాలికంగా నిలిచిపోయిన చర్చల్ని ఇరాన్ ఇంకా ఆలస్యం చేస్తోందని ఇటీవల అమెరికా విమర్శించింది. అమెరికా సెక్రెటరీ మార్కు రుబియో మాట్లాడుతూ ట్రంప్ ఒక డీల్ గురించి ప్రస్తావించారని, అయితే, అది కుదుర్చుకోవడం కష్టమని అన్నారు. ఇరాన్‌పై దాడులు చేస్తామని ట్రంప్ ఇటీవల హెచ్చరించారు. ఇదే సమయంలో ఒమన్ వేదికగా ఇరు దేశాల మధ్య పరోక్ష చర్చలు జరిగాయి. ఒమన్ చర్చలు సానుకూలంగానే ఉన్నాయని ట్రంప్ ఇటీవల తెలిపాడు. ఇక రెండో దశ చర్చలు వచ్చే మంగళవారం జెనీవా వేదికగా జరుగుతాయని కూడా తఖ్త్ రావంచి పేర్కొన్నారు.