మెదక్, ఏప్రిల్ 24(నమస్తే తెలంగాణ): ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘల ప్రతినిధులు, ఆర్టీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. మెదక్ పట్టణంలో డ్రైవర్ శంకర్‌గౌడ్ ఆత్మహత్యకు నిరసనగా శుక్రవారం ఆర్టీసీ జేఏసీ, రాజకీయ పార్టీల నాయకులు శాంతిర్యాలీ నిర్వహించారు. మెదక్ ఆర్టీసీ డిపో నుంచి రామ్‌దాస్ చౌరస్తా వద్దకు భారీ ర్యాలీ నిర్వహించి నిసరన తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, పీఆర్సీ ప్రకటించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నిర్లక్ష్యంతోనే ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి ఉంటే కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే వారు కాదన్నారు. ఆత్మహత్య చేసుకున్న శంకర్‌గౌడ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.
ఆర్టీసీ కార్మికులు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని, పోరాడి సమస్యలు పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం శంకర్‌గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మెదక్ ఆర్టీసీ డిపో నుంచి అధికారులు బస్సులు నడిపించేందుకు ప్రయత్నం చేయగా కార్మికులు అడ్డుకున్నారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, కౌన్సిలర్లు జుబేర్, సీఐటీయూ నాయకుడు మల్లేశం, టీఎన్జీవో నాయకులు నరేందర్, బాలామణి, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.