దుబ్బాక, ఏప్రిల్ 3: దుబ్బాక రైతులకు సాగునీటిని అందించేందుకు కేసీఆర్ మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం కాలువలు కూడా నిర్మించకుండా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ ఈ ప్రాంత రైతులకు అన్యాయం చేస్తున్నదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. గురువారం దుబ్బాక మండలంలో పెద్దగుండవెల్లి, తిమ్మాపూర్, అప్పనపల్లి శివారులో మల్లన్నసాగర్ 12వ ప్యాకేజీ ప్రధాన కాల్వ నిర్మాణ పనులు, తొగుట మండలం తుక్కాపూర్ నుంచి ఎల్లారెడ్డిపేట పంపుహౌస్ ద్వారా దుబ్బాక మండలం వరకు ఏర్పాటు చేసిన పైపులైన్‌ను ఆయన పరిశీలించారు.
3 గంటలకు పైగా ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి కాల్వలు , పైపు లైన్ పనులతో పాటు గొలుసుకట్ట చెరువులు, కుంటలను పరిశీలించారు. పలుచోట్ల వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో కాలినడకన, మరికొన్ని చోట్ల బైక్‌పై వెళ్లి పరిశీలించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు అధికారులు, నీటి పారుదలశాఖ, రెవెన్యూ అధికారులతో కలిసి మ్యాప్‌ల ద్వారా ఎమ్మెల్యే వివరాలు అడిగి తెలుసుకున్నారు. పలు కారణాలతో పనులు ఆలస్యం అవుతున్నాయని అధికారులు వివరించారు. నియోజకవర్గంలో ఉప కాల్వల నిర్మాణం, పైపులైన్ ఏర్పాటు పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుండడంపై ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
మల్లన్నసాగర్ నుంచి 40 కి.మీ దూరంతో 12వ ప్యాకేజీ ప్రధాన కాల్వ, 20 కి.మీ దూరంలో పైపు లైన్ నిర్మాణం చేపట్టాల్సి ఉందని, వీటి ద్వారా నియోజకవర్గంలో 1.25లక్షల ఎకరాలకు సాగునీరు సరఫరా చేయాల్సి ఉండగా, పనులు పూర్తి కాకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం దుబ్బాక మున్సిపల్ పరిధిలోని మల్లాయిపల్లి వద్ద 4ఎల్ డిస్ట్రిబ్యూటరీ కాల్వను ఆయన పరిశీలించారు.
ఉప కాల్వ ద్వారా దుబ్బాక పెద్ద చెరువులోకి నీటిని తరలించేందుకు అధికారులతో చర్చించారు. దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్నసాగర్ నుంచి 70 ఉప కాల్వల నిర్మాణం చేపట్టాల్సి ఉండగా, చాలా మేర పనులు అసంపూర్తిగా ఉన్నాయని, రైతులు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్యంతో పనులు చేపట్టక పోవడంతో సాగునీటి సమస్య నెలకొందన్నారు. సీఎం, మంత్రికి పలుసార్లు విన్నవించినా స్పందించడం లేదని, కనీసం సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించలేని అసమర్థత ప్రభుత్వం కాంగ్రెస్‌ది అని కొత్త ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు.
దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్నసాగర్ ఉన్నా సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో మూడు ప్రధాన కాల్వల ద్వారా సాగునీరు సరఫరా చేయకుండా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని ఆయన మండిపడ్డారు. మల్లన్నసాగర్ నుంచి పక్క జిల్లాలకు, హైదరాబాద్‌కు సాగు,తాగునీరు తీసుకెళ్తూ దుబ్బాక నియోజకవర్గ రైతులకు సాగునీరు అందించకుండా అన్యాయం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనిపై త్వరలో రైతులతో కలిసి ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో, పాలనలో విఫలమైనట్లు ఆయన విమర్శించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, తిమ్మాపూర్ మాజీ ఎంపీటీసీ మాధవి, బీఆర్ఎస్ నాయకులు రొట్టే రాజమౌళి, ఎల్లారెడ్డి, కిషన్‌రెడ్డి, ఆస యాదగిరి, స్వామి, భూంరెడ్డి, వేణు, సంజీవ్‌రెడ్డి, రామచంద్రం, సత్యం పాల్గొన్నారు.