అక్కన్నపేట, అక్టోబర్ 10: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లి ప్రాజెక్టు ప్రధాన ముంపు గ్రామమైన గూడాటిపల్లి గ్రామ పంచాయతీలో నిధులు గోల్మా ల్ అయ్యాయి. ముంపులో ఊరు మునిగినా, అభివృద్ధి పనుల పేరిట నిధులు డ్రా చేసి ఏకంగా రూ. 25 లక్షలను మింగినట్లు తెలుస్తోంది. సమాచార హక్కు చట్టంతో వెలుగులోకి వచ్చిన ఈ కుంభకోణం వెనుక పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్, ఉప సర్పంచ్, స్పెషల్ ఆఫీసర్, డివిజనల్ స్థాయి అధికారి పాత్ర ఉన్నట్లు భూనిర్వాసితులు ఆరోపిస్తున్నారు. దీనిపై డీపీవోకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భూనిర్వాసితులు ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
2023 ఏప్రిల్‌లో గూడాటిపల్లి నుంచి గ్రామస్తులను ఖాళీ చేయించారు. ఊరు ఖాళీ చేసే నాటికి గ్రామ పంచాయతీ ఖాతాలో వివిధ రకాల గ్రాంట్ల కింద మంజూరైన సుమారు రూ. 40 లక్షల నిధులు నిల్వ ఉన్నాయి. అప్పటికే ముంపు గ్రామంగా డిక్లేర్ చేయడంతో గ్రామ అభివృద్ధిని ఆపేశారు. కాగా, ఇక్కడి భూ నిర్వాసితులు హుస్నాబాద్‌లోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, నందారం స్టేజీ, గౌరవెల్లి మూలమలుపు వద్ద, హుస్నాబాద్‌లోని కరీంనగర్ రోడ్డులోని పెట్రోల్ పంపు వెనుకాల, పోతారం(ఎస్) సమీపంలోని మర్రిచెట్టు మీర్జాపూర్ క్రాసింగ్ వద్ద నివాసాలు ఏర్పచుకున్నారు.
ఏడాది క్రితం నందారం స్టేజీ వద్ద ఉన్న భూ నిర్వాసితుడు మామిడి శ్రీకాంత్‌రెడ్డి మొదట తమ గూడాటిపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధులు, ఖర్చులు, నిల్వ తెలిపే యాప్(కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన) ద్వారా తెలుసుకున్నాడు. నిధులు వివిధ పనుల కోసం ఖర్చు చేస్తున్నట్లు గుర్తించాడు. వెంటనే సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశాడు. సమాచారం ఇవ్వకుండా అధికారులు ముప్పుతిప్పలు పెట్టారు. అయినా పట్టు వదలకుండా ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న భూనిర్వాసితులకు విషయం చెప్పాడు. దీంతో భూ నిర్వాసిత యువకులు సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు తెలుసుకున్నారు. గ్రామ పంచాయతీలో అవినీతి, అక్రమాలు చేసి రూ. 25 లక్షల వరకు అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి దోపిడీ చేసినట్లు గుర్తించారు.
గూడాటిపల్లి గ్రామ పంచాయతీ ఖాతాలో నిల్వ ఉన్న రూ. 40 లక్షల నిధులపైన కార్యదర్శి సతీశ్ కన్నుపడింది. 2023 ఏప్రిల్‌లో ఊరు ఖాళీ అయ్యింది. ఆ నిధులు కాజేయాలనీ ఆలోచనతో అప్పటి సర్పంచ్ బద్దం రాజిరెడ్డి, ఉపసర్పంచ్ జరుపుల రేణుకతో కలిసి పన్నాగం పన్నినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. 2024 ఫిబ్రవరి 1న పంచాయతీ పాలకవర్గం గడువు ముగిసింది. 10 నెలల కాలంలో సుమారు రూ. 15 లక్షల వరకు నిధులు దోపిడీ చేశారు.
తదనంతరం గ్రామ స్పెషల్ ఆఫీసర్, కార్యదర్శి కలిసి 2025 జనవరి వరకు అంటే 11 నెలల కాలంలో మరో రూ. 10 లక్షలపై చిలుకు నిధులు డ్రాచేశారు. ప్రధానంగా పైపులైన్లు, వీధిదీపాలు, చెత్త సేకరణ, గేట్వాల్స్ రిపేరు, తండాలకు మట్టిరోడ్లు, హరితహారంలో మొక్కలు నాటడం, నీళ్లు పోయడం, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, లేబర్ జీతాలు, ట్రాక్టర్, గ్రామ పంచాయతీ నిర్వహణ, ఇలా అడ్డగోలుగా వాళ్ల ఇష్టారాజ్యంగా బిల్లులు తయారు చేశారు. క్షేత్రస్థాయిలో ఎక్కడా ఈ పనులు జరగలేదని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు.
గౌరవెల్లి ప్రాజెక్టు ప్రధాన ముంపు గ్రామమైన గూడాటిపల్లి సర్పంచ్ బద్దం రాజిరెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. ఇతడు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు అనుచరుడు. గతంలో బీఆర్ఎస్ హయాంలో గౌరవెల్లి ప్రాజెక్ట్టుపైనా ఎన్జీటీలో కేసులు వేయించి, ప్రాజెక్టు పనులు అడ్డుకున్నాడు. గూడాటిపల్లి సర్పంచ్ పదవిని అడ్డంపెట్టుకొని అధికారులతో కలిసి గ్రామ పంచాయతీ నిధులు స్వాహా చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. మంత్రి అండతోనే ఆయన గూడాటిపల్లి జీపీ నిధుల్లో అవినీతి, అక్రమాలు చేశాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గూడాటిపల్లి గ్రామం ముంపునకు గురవుతుండడంతో అక్కడి ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి ఆదాయం వచ్చే పనులైనా టెండర్ ద్వారా చేయాలి.
కానీ, నిబంధనలకు విరుద్ధంగా గ్రామంలోని 14 బోర్మోటర్లు, పైపులు, పాత ఇనుప సామగ్రి, ఇతరత్రా వస్తువులను ఎవరికి తెలియకుండానే కార్యదర్శి సతీశ్, సర్పంచ్ రాజిరెడ్డి కలిసి అమ్ముకుని సొమ్ముచేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గూడాటిపల్లి గ్రామ పంచాయతీలో ఆరుగురు మల్టీపర్పస్ వర్కర్లు పనిచేసేవారు. ఇందులో ప్రస్తుతం ముగ్గురు వర్కర్లు భూనిర్వాసితుల కాలనీ సేవాలాల్ మహారాజ్తండా గ్రామ పంచాయతీలో పనిచేస్తుండగా, మరో ఇద్దరు గౌరవెల్లి గ్రామ పంచాయతీలో, కారోబార్ మాత్రం డీఎల్పీవో ఆఫీసులో పనిచేస్తున్నాడు. ఐదుగురు మల్ట్టీపర్పస్ వర్కర్లకు సంబంధించిన నాలుగు నెలల జీతాలను కారోబార్ తన ఖాతాలో వేసుకొని కార్యదర్శితో కలిసి పంచుకున్నట్లు మల్టీపర్పస్ వర్కర్ ఒకరు ఆరోపంచారు.
ముంపునకు గురైన గూడాటిపల్లి గ్రామ పంచాయతీ ఖాతాలోని నిధులను అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు కలిసి దుర్వినియోగానికి పాల్పడ్డారు. సమాచార హక్కు చట్టం ద్వారా నిధులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జరగని పనులకు బిల్లులు తయారు చేసి దోపిడీ చేశారు. ఇందుకు సంబంధించి మా వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయి. దీనిపై ఎంపీడీవో, డీపీవోకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేశాం. విచారణ చేపట్టి బాధ్యుల నుంచి నిధులు రికవరీ చేయాలి.
-మామిడి శ్రీకాంత్‌రెడ్డి, భూనిర్వాసితుడు
నిధులు స్వాహా చేశారని గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో డీఎల్పీవోనే నేడు విచారణ అధికారిగా ఉన్నారు. రూ.6.80 లక్షల నిధులకు సంబంధించి బిల్లులు లేవని, కలెక్టరేట్ నుంచి షోకాజ్ నోటీసు వచ్చింది. ఈ ఘటనపై విచారణ కొనసాగుతున్నది. త్వరలోనే విచారణ నివేదిక కూడా వస్తుంది, ఎక్కడా కూడా నిధులు దుర్వినియోగం చేయలేదు. ఆ సమయంలో నాతో పాటు డీఎల్పీవో కూడా గ్రామస్పెషల్ ఆఫీసర్‌గా పని చేశారు.
-అప్పటి గ్రామ పంచాయతీ కార్యదర్శి సతీశ్
నా పదవీ కాలంలో ఎలాంటి అవినీతి, అక్రమాలు జరగలేదు. 2019-2020 సంవత్సరంలో రూ. 6.80 లక్షల నిధులకు సంబంధించి రికార్డులు, బిల్లులు దొరకకపోవడంతో కలెక్టరేట్ నుంచి షోకాజ్ నోటీసు జారీ అయ్యింది. అందుకు సంబంధించి వివరణ రావాల్సి ఉంది. గ్రామ పంచాయతీ నిధులు ఎక్కడా కూడా స్వా హా జరగలేదు. పారదర్శకంగా పని చేశాం, కావాలనే కొంతమంది నన్ను బద్నాం చేస్తున్నారు.
-మాజీ సర్పంచ్ బద్దం రాజిరెడ్డి