హుస్నాబాద్, ఆగస్టు 28 : నిస్వార్థ సేవతో నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళుతూ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల మనసులను దోచుకున్నారు ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్. 2014వరకు మెట్ట ప్రాంతంగా ఉన్న హుస్నాబాద్ నిత్యం కరువుకాటకాలతో అల్లాడుతుండేది. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ వచ్చాక ప్రత్యేక రాష్ట్ర ఫలాలను అందించిన ఘనత ఎమ్మెల్యే సతీశ్కుమార్కే చెందుతుంది. కరువు కాటకాల హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే ఆయన లక్ష్యం వల్ల దాదాపు ఇప్పటివరకు రూ.7వేల కోట్లకుపైగా అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజలకు అందించారు. గడిచిన తొమ్మిదేండ్లలో నియోజకవర్గలో రోడ్లు, భవనాలు, తాగునీరు, సాగునీటి సౌకర్యం, పాలనను ప్రజల వద్దకే తేవడం, గిరిజన తండాల అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు, మహిళలకు ప్రభుత్వ ఫలాలను అందజేయడంలో ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ ముందుండి పనిచేశారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తొమ్మిదేండ్లలో ఆయన నియోజకవర్గానికి చేసిన సేవలు, అభివృద్ధిపై నమస్తేతెలంగాణతో ఆయన మాటల్లోనే…
నమస్తే తెలంగాణ: మీరు ఎమ్మెల్యే అయ్యాక హుస్నాబాద్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఏమిటి..?
వొడితెల సతీశ్‌కుమార్: 2014కు ముందు బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జిగా ఇక్కడి కరువు పరిస్థితులను కండ్లరా చూశాను. ప్రజలు పడుతున్న బాధలను గమనించాను. సీఎం కేసీఆర్ పోరాటం వల్ల తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆయన సూచనలను 2014లో ఎమ్మెల్యే అయ్యాక తూచా తప్పకుండా పాటించాను. హుస్నాబాద్ ప్రాంత పరిస్థితులు సీఎం కేసీఆర్‌కు కూడా తెలుసు. అందుకే గౌరవెల్లి లాంటి రిజర్వాయర్‌ను పూర్తి చేయించడం, మహాసముద్రంగండి, శనిగరం, సింగరాయ ప్రాజెక్టుల మరమ్మతులు చేయించారు. నియోజకవర్గ అవసరాల గురించి చెప్పిన ప్రతి సారి ఆయన స్పందించేవారు. సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ సహకారంతో పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రోడ్లను 95శాతం వరకు పూర్తి చేశాం. మిషన్ కాకతీయతో 456 చెరువులను మరమ్మతులు చేయించాం. 13 చెక్‌డ్యామ్‌లు నిర్మించాం. 16 విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణం జరిగింది. లోవోల్టేజీ సమస్య అనేది నియోజకవర్గంలో లేదు.
నమస్తే తెలంగాణ: గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణంతో నియోజకవర్గంలో కరువు శాశ్వతంగా దూరమైనట్లేనా…?
సతీశ్‌కుమార్: గౌరవెల్లి రిజర్వాయర్ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇటీవల ట్రయల్ రన్లో నీటిని కూడా ఎత్తిపోశాం. త్వరలోనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తాం. ఐదు దశాబ్దాలుగా వరద కాల్వ కోసం పోరాటాలు చేసిన ఈ ప్రాంత ప్రజల కలలను సీఎం కేసీఆర్ కేవలం ఎనిమిదేండ్లలో నిజం చేశారు. కుర్చీ వేసుకొని కూర్చొని రిజర్వాయర్ పూర్తి చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకున్న ఘనత ఆయనదే. ఇందులో 8.23టీఎంసీల నీళ్లు నింపితే నియోజకవర్గంలోని 1.06లక్షల ఎకరాలకు సాగునీరందుతుంది. ఒకవైపు దేవాదులతో భీమదేవరపల్లి మండలం, మరోవైపు మిడ్‌మానేరుతో చిగురుమామిడి మండలం, ఇంకోవైపు కాకతీయ కాలువతో ఎల్కతుర్తి మండలానికి ఇప్పటికే సాగునీరు అందుతోంది. గౌరవెల్లితో హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాలకు త్వరలోనే సాగునీరందుతుంది. దీంతో రాబోయే రోజుల్లో రాష్ట్రంలోనే పంటలు పండించడంలో హుస్నాబాద్ నియోజకవర్గం ప్రథమస్థానంలో నిలబడుతుందనే నమ్మకం ఉంది. ప్రతి మండలంలో ప్రతి పంటకూ 2లక్షల క్వింటాళ్ల దిగుబడులు వస్తున్నాయంటే కరువు పోయినట్లే కదా…
నమస్తే తెలంగాణ: నిరుద్యోగ యువతీయువకులకు, విద్యార్థులకు మీరిచ్చిన ప్రోత్సాహం ఏమిటి?
సతీశ్‌కుమార్: నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీయువకులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో పలుమార్లు ఉచిత కోచింగ్ సెంటర్లను సొంత ఖర్చులతో నిర్వహించాం. ఉచిత శిక్షణ, భోజనంతో నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి యువతీయువకులను ఉచిత కోచింగ్ సెంటర్‌కు వచ్చేలా ఏర్పాట్లు చేశాం. ఆర్మీ కమ్ పోలీసు ఉద్యోగాల్లో నియోజకవర్గ యువతీయువకులు ఎక్కువగా నియామకం కావాలనే లక్ష్యంతో సుమారు వెయ్యిమందికి మూడు నెలలపాటు ఉచిత శిక్షణ ఇప్పించాం. చాలామంది యువతీ యువకులు ఆర్మీలో, పోలీసు డిపార్ట్మెంటులో ఉద్యోగాలు సాధించారు. గ్రూప్స్, డీఎస్స్సీ లాంటి పోటీ పరీక్షల కోచింగ్‌కు దూరప్రాంతాలకు వెళ్లి ఫీజులు చెల్లించే స్థోమత లేని విద్యార్థుల కోసం రెండుసార్లు నాలుగు నెలలపాటు కార్పొరేట్ స్థాయి ఫ్యాకల్టీలతో ఉచిత కోచింగ్ ఇప్పించాం. సుమారు 2000లకు పైగా కళాశాల విద్యార్థులకు సొంత ఖర్చులతో ఉచిత మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించాం. నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, మోడల్ కళాశాల విద్యార్థులందరూ ప్రయోజనం పొందారు. మంచి ఫలితాలను సాధించారు.
నమస్తే తెలంగాణ: నియోజకవర్గంలో వైద్యం, విద్యాసౌకర్యాలు ఎలా ఉన్నాయి…?
సతీశ్‌కుమార్: విద్య, వైద్యం విషయంలో మొదటి నుంచి ప్రత్యేక దృష్టి సారించాం. ముఖ్యంగా హుస్నాబాద్ పట్టణంలోని సర్కారు దవాఖాన సౌకర్యాలలేమితో ఉండేది. 2014 తర్వాత అదనపు భవనం నిర్మించాం. పీహెచ్సీగా ఉన్న దానిని సీహెచ్‌సీగా మార్చడంతో వైద్యసేవలు పెరిగాయి. అన్ని రకాల వైద్యసేవలు ఇక్కడే అందుతున్నాయి.. ఒకప్పుడు గర్భిణులను కరీంనగర్, వరంగల్ నగరాలకు తీసుకెళ్లే వారు. కానీ అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు. అన్ని రకాల ఆపరేషన్లు, సీజేరియన్లు ఈ దవాఖానల్లోనే జరుగుతున్నాయి.. ఇటీవల ఆరోగ్యశాఖమంత్రి హరీశ్‌రావు మాతా, శిశు సంరక్షణ కేంద్రాన్ని కూడా మంజూరు చేశారు. రూ.7.50కోట్లతో నిర్మిస్తున్న భవనం పూర్తికావస్తోంది. త్వరలోనే జిల్లా కేంద్రంలోని దవాఖానకు దీటుగా ఇక్కడ వైద్యసేవలందనున్నాయి. మంత్రి సహకారంతో డయాలసిస్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశాం.
కిడ్నీ రోగులకు వరంగా మారింది. అన్ని మండలాల్లోని పీహెచ్‌సీలు, బస్తీ, పల్లె దవాఖానల్లో సకల సౌకర్యాలు ఉన్నాయి. అలాగే మైనార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకులాలను సైతం ఏర్పాటు చేశాం. రాబోయే రోజుల్లో హుస్నాబాద్ విద్యాకేంద్రంగా మారబోతున్నది.
నమస్తే తెలంగాణ: హుస్నాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి ఎలా ఉంది…?
సతీశ్‌కుమార్: నియోజకవర్గ కేంద్రమైన హుస్నాబాద్ పట్టణాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేశాం. ఆర్డీవో కేంద్రంగా మార్చాం. నగర పంచాయతీగా ఉన్న పట్టణాన్ని మున్సిపాలిటీగా మార్చడంతో పట్టణ రూపురేఖలు మారిపోయాయి. సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ పట్టణ అభివృద్ధి కోసం అడగ్గానే సుమారు రూ.55కోట్లకుపైగా నిధులు మంజూరు చేశారు. రూ.30కోట్లతో పట్టణంలో సీసీ, డ్రైనేజీల నిర్మాణం, మౌలిక సదుపాయాలు కల్పించాం. ఇటీవల మరో రూ.25కోట్ల నిధులు వచ్చాయి. వీటితో పట్టణంలో వందశాతం అభివృద్ధి పనులు చేపడతాం. పట్టణానికి రెండుసార్లు జాతీయస్థాయి అవార్డులు రావడం నాతోపాటు పాలకవర్గం, అధికారులు చేసిన కృషికి నిదర్శనం. సకల హంగులతో ఐవోసీ భవన నిర్మాణం పూర్తవుతోంది. త్వరలో మంత్రితో ప్రారంభిస్తాం. హరితహారంతో పచ్చదనాన్ని తెచ్చి పట్టణాన్ని పరిశుభ్రతంగా మార్చి వ్యాధులను దూరం చేస్తున్నం.
నమస్తే తెలంగాణ: బీఆర్ఎస్ అధిష్టానం మూడోసారి కూడా మీకే టికెట్ ఇచ్చింది… మళ్లీ గెలిస్తే భవిష్యత్ ప్రణాళిక ఏమిటి…?
సతీశ్‌కుమార్: సీఎం కేసీఆర్ మూడోసారి కూడా బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడం ఆనందంగా ఉంది. నా సేవలకు ఇది గుర్తింపుగా భావిస్తాను. నియోజకవర్గంలోని యువతకు ఉపాధికల్పనే ధ్యేయంగా పనిచేస్తా. ఇప్పటికే చిగురుమామిడి మండలంలోని ఓగులాపూర్ భూములు, భీమదేవరపల్లి మండలం వంగర సమీపంలోని భూములను ఇండస్ట్రియల్ కారిడార్‌గా ప్రకటించాం. ఈ ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతోపాటు వివిధ రకాల పరిశ్రమలను నెలకొల్పి యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తా. ప్రభుత్వ ఉద్యోగాలు రాని నిరుద్యోగ యువతీయువకులకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఉపాధి కల్పిస్తాం. గౌరవెల్లితో ప్రతి గజానికీ సాగునీరందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తా. మరిన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలను మంజూరు చేయించి విద్యాకేంద్రంగా మార్చుతా. పట్టణం, పల్లె అనే తేడా లేకుండా సమపాళ్లలో అభివృద్ధి జరిగేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తా. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చూస్తా. ప్రజావసరాలకు అనుగుణంగా ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతా.