హుస్నాబాద్, ఆగస్టు 29: విద్యార్థులు విద్యతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకొని, నచ్చిన క్రీడలో నిత్యం సాధన చేయడం ద్వారా రాష్ట్ర, జాతీయస్థాయికి ఎదగాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ప్రముఖ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం మాట్లాడుతూ హుస్నాబాద్ ప్రాంత పాఠశాలల నుంచి ఎక్కువ మంది విద్యార్థులు క్రీడా పాఠశాలకు ఎంపిక కావాలన్నారు. రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపికైన విద్యార్థికి రూ.50 వేలు, జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థులకు రూ. లక్ష నగదు బహుమతి అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో వ్యాయామ ఉపాధ్యాయుల ఖాళీలు ఎక్కడ ఉన్నా వెంటనే భర్తీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
చదువుతోపాటు ఆటల్లోనూ నంబర్‌వన్‌గా ఉండాలన్నారు. పట్టణంలోని మినీ స్టేడియాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం క్రీడాపోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్డీవో రామ్మూర్తి, ము న్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, వైస్‌చైర్‌పర్సన్ అయిలేని అనితారెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, తహసీల్దార్ రవీందర్‌రెడ్డి, కమిషనర్ మల్లికార్జున్, నాయకులు లింగమూర్తి, వెన్న రాజు, భాగ్యరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తండాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
హుస్నాబాద్, ఆగస్టు 29 : తండాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం హుస్నాబాద్‌లోని అక్కన్నపేట రోడ్డు లో జరిగిన గిరిజనుల తీజ్ ఉత్సవాలకు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజయ్యతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
గిరిజనులు, మహిళలతో కలిసి నృత్యాలు చేశారు. ఏపుగా పెరిగిన తీజ్‌లను గిరిజనులు మంత్రికి అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కనీస సౌకర్యాలు లేక విద్యకు దూరంగా ఉన్న తండాలు, గిరిజనులను గుర్తించి తండాల్లో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. గిరిజన సంఘాల నాయకులతోపాటు మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, వైస్‌చైర్‌పర్సన్ అయిలేని అనితారెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.