న్యాల్కల్, ఫిబ్రవరి 20: మండల కేంద్రం శివారులోని షరీఫ్ పీర్గైబ్ సాహెబ్ ఖిల్లా దర్గా ఉర్సులో భాగంగా మంగళవారం అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు నిర్వహించారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన మల్లయోధులు పోటీల్లో పాల్గొన్నారు. డప్పుచప్పుళ్లు, ప్రేక్షకుల ఈలలు, కేరింతల మధ్య మల్లయోధులు నువ్వానేనా అన్న రీతిలో తలపడ్డారు. పెద్దవాళ్లతో పాటు చిన్నారులు, యువకుల మధ్య జరిగిన పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ స్థాయిల్లో గెలుపొందిన విజేతలకు వెండి కడియాలతో పాటు రూ.100 నుంచి రూ. 20వేల వరకు అందజేశారు. ఫైనల్లో మహారాష్ట్ర కోలాపూర్కు చెందిన మల్లయోధుడు లింగరాజ్ అదే ప్రాంతంలోని లాతూర్కు చెందిన బహుమని ముగ్దర్ పోటీ పడగా, లింగరాజ్ విజేతగా నిలిచాడు.
బీఆర్ఎస్ మండల మైనార్టీ సెల్ నాయకుడు సయ్యద్ షకీల్ హైమద్ లింగరాజ్కు రూ. 20,051 వేల నగదును అందజేసి ఘనంగా సత్కరించారు. ఎక్కడా గొడవలు జరుగకుండా ఉర్సు నిర్వాహకులు, హద్నూర పోలీసులు పకడ్బందీగా బందోబస్తు చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో ఉర్సు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు యూనూస్ఖాన్, పార్టీ మండల నాయకులు బస్వరాజ్, పడకంటి వెంకట్, భద్రుస్వామి, నర్సింహులు, జగన్నాథ్, వాహబ్, మైబుబ్, మక్సూద్, ఇస్లాంపటేల్ తదితరులు పాల్గొన్నారు.