శివ్వంపేట, డిసెంబర్ 5 : మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చండి గ్రామం సమీపంలోని నర్సాపూర్–తూప్రాన్ ప్రధాన రహదారి పై పోలీసులు శుక్రవారం ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వాహనాలలో భారీ మొత్తంలో నగదు, మద్యం రవాణా వంటి అక్రమ రవాణాలను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
తనిఖీల సమయంలో వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు, రిజిస్ట్రేషన్ వివరాలను పరిశీలించారు. ఎన్నికల సమయంలో చట్టవిరుద్ధంగా డబ్బు పంపిణీ, మద్యం సరఫరా వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని పోలీసులు హెచ్చరించారు. ఎన్నికల ముగింపు వరకు ఇదే విధంగా తనిఖీలు కొనసాగనున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ తనిఖీలలో డిప్యూటీ తహసీల్దార్ షఫీయొద్దిన్, సంబంధిత అధికారులు పోలీసులు పాల్గొన్నారు.